నయీం అకృత్యాలు: కళ్లకు గంతలు కట్టి పది కార్లు మార్చారు
నల్లగొండ: తనను నయీం, అతని ముఠా సభ్యులు బెదిరించి డబ్బులు లాగేసుకున్న వైనాన్ని ఓ బాధితుడు మీడియా ప్రతినిధులకు చెప్పాడు. రెండు కోట్లు ఇస్తా... మొత్తం ఆస్తులు రాసిచ్చేయ్ అంటూ నరుూం తనను బెదిరించాడని నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన చెన్నోజు బ్రహ్మచారి చెప్పారు. నయీం అరాచకాలపై, అక్రమ వసూళ్లపై భువనగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మంగళవారం ఆయన తెలిపారు.
నయీం అనుచరుడైన కత్తుల జంగయ్య తన వద్దకు వచ్చి నయీం ముఖ్యఅనుచరుడైన పాశం శ్రీనుతో మాట్లాడించి అన్న రమ్మంటున్నాడని బెదిరించాడని చెప్పి. పాశం శ్రీను, షకీల్ తమను నయీం వద్దకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో తమ కళ్లకు గంతలు కట్టి 10 కార్లను మార్చారని తెలియజేశారు. తనకు డబ్బులు అవసరమున్నాయని, 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేనిపక్షంలో తన ఇద్దరు కొడుకుల కణతలకు గన్లు పెట్టి చంపేస్తామని బెదిరించాని చెప్పారు.

దీంతో నయీం కాళ్లవేళ్లా పడ్డానని, మొదటగా 5 కోట్లకు తగ్గి అనంతరం కనీసం 2 కోట్లు అయినా ఇవ్వాల్సిందేనని నిర్ణయించేశాడని చెప్పారు. తమ ఆస్తులమ్మినా 2 కోట్లు రావని తెలిపినా తాము 2 కోట్ల 10 లక్షలు ఇస్తామని, మొత్తం ఆస్తులు రాసివ్వాల్సిందిగా నయీం బెదిరించాడని తెలిపారు. మూడు గంటలపాటు బతిమాలిన అనంతరం చివరగా 20 లక్షల రూపాయలకు ఒప్పుకుని పాశం శ్రీనుకు అప్పగించడంతో బొడుప్పల్‌లో గల తన ఇంటిని అమ్మి వారికి ఆ డబ్బులు చెల్లించామని వివరించారు.
మొదటిసారిగా 2004 సంవత్సరంలో నయీం తనను పిలిపించి రెండు లక్షల రూపాయలను ఇవ్వాలని, లేనిపక్షంలో తన కుమారులను చంపేస్తామని బెదిరించడంతో బతిమిలాడుకుని లక్షన్నర రూపాయలు ఆయన అనుచరుడైన షకీల్‌కు చెల్లించామని తెలిపారు.
నల్లగొండ రోడ్డులోని 1-8-192 నెంబరు గల మడిగెను కూడా నయీం అన్నకు అవసరముందంటూ నయీం అనుచరులైన పాశం శ్రీనివాస్, షకీల్ తన కుటుంబ సభ్యులను నామరూపం లేకుండా చేస్తామని బెదిరించి మడిగెను కూడా నయీం సహోదరి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపోయారు.












Click it and Unblock the Notifications