మందుబాబులకు ఇక పండుగే - ఆ బ్రాండ్లు ఎంట్రీ, తొలిసారి..!!
మద్యం ప్రియులకు పండుగ లాంటి వార్త. రెగ్యులర్ బ్రాండ్లతో పాటుగా కొత్త బ్రాండ్ల మద్యం అందుబాటులోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో 2024-25 కాలానికి మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ ఏడాది అదే స్థాయిలో అమ్మకాలు పెంచుకునేందుకు ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా కొత్త బ్రాండ్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ఇందు కోసం మద్యం కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణ కు అనూహ్య స్పందన వచ్చింది. ఫలితంగా కొత్తగా 604 మద్యం బ్రాండ్లను తీసుకొచ్చేందుకు రంగం సిద్దం అవుతోంది. అందులో 273 విదేశీ మద్యం బ్రాండ్లు ఉన్నాయి.
కొత్త మద్యం బ్రాండ్లు
కొత్త మద్యం బ్రాండ్లు ఎంట్రీకి రంగం సిద్దమైంది. కొత్త బ్రాండ్ల మద్యం సరఫరా కోసం కంపెనీలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల కోసం తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తయారీ, సరఫరాదారులను ఆహ్వానించింది. ఈ మేరకు ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులకు మార్చి 15 తుదిగడువు విఽధించినా ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించింది. నోటిఫికేషన్ కు అనూహ్య స్పందన కనిపించింది. రాష్ట్రంలో 604 రకాలైన కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం 92 మద్యం తయారీ, సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో విదేశీ బ్రాండ్లు 273 వరకు ఉండగా స్వదేశీ బ్రాండ్లు 331 ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ రకాలైన మద్యం సరఫరా చేస్తున్న 45 పాత కంపెనీలు 218 కొత్త రకాల మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

రాష్ట్రంలో తొలిసారి
రాష్ట్రంలో తొలిసారిగా కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల కోసం 47 కొత్త కంపెనీలు 386 రకాల కొత్త మద్యం బ్రాండ్లు తెచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో 2023-24లో రూ. 34,800 కోట్లు, 2024-25లో రూ.34,600 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ శాఖ అధికారుల లెక్కల మేరకు గత ఆర్థిక సంవత్సరంలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు, లైసెన్సు ఫీజు కలిపి దాదాపు రూ.264 కోట్లు వచ్చాయి. గతంలో 548 లక్షల కాటన్లు, ఈ సారి 531లక్షల కాటన్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఇక 362 లక్షల కేసులు మద్యం గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించగా ఈసారి 369 లక్షల కేసుల మద్యం విక్రయించారు. గతం కంటే 2 శాతం మద్యం విక్రయాల పెరిగాయి. ఆదాయం నిరుటి కంటే 7శాతం పెరిగింది. రాష్ట్రంలో 2025-26లో రూ.27,623.36 కోట్లు రాబట్టాలని ఎక్సైజ్‌శాఖ లక్ష్యంగా నిర్ణయించింది.
బీర్లు - బార్లు
ఆర్దికంగా లక్ష్య సాధన కోసం ఎక్సైజ్ శాఖ ఇప్పటికే బీర్ల ధర పెంచడంతో పాటు కొత్తగా 25 బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే కొత్త బ్రాండ్లకు అవకాశం కల్పించారు. ఇప్పటికే సరఫరా చేస్తున్న 32 దేశీయ కంపెనీలు 149 రకాలైన మద్యం సరఫరాకు దరఖాస్తు చేసుకోగా.. 13 విదేశీ కంపెనీలు 69 రకాల ఫారిన్‌లిక్కర్ బ్రాండ్ల సరఫరాకు దరఖాస్తు చేసుకున్నాయి. కొత్తగా 204 రకాల ఫారిన్ లిక్కర్ బ్రాండ్లకు దరఖాస్తులు రాగా.. 182 రకాల కొత్త మద్యం ఇండియన్ మేడ్ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి. ఇక.. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ వచ్చిన దరఖాస్తుల పరిశీలన.. అర్హతలను చూసిన తరువాత వీటికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ధరల విషయంలోనూ ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications