ఎన్నో ఏళ్ల కల నెరవేరుతున్న వేళ.. నేడే నూతన రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వారికి కొత్త రేషన్ కార్డు అందించనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా.. 11 మంది లబ్ధిదారులకు సీఎం కార్డులు అందజేయనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి.. ప్రభుత్వ సంకల్పాన్ని వివరించనున్నారు.
ఈ మేరకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 80 వేల మందితో భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామేల్ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంతో మొత్తం 3,58,187 కొత్త రేషన్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నారు. దీనివల్ల 11,11,223 మందికి నేరుగా లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా పాత కార్డుల్లో కొత్తగా 4,41,851 మందిని సభ్యులుగా చేర్చామని.. ఈ రెండింటినీ కలిపి చూస్తే మొత్తంగా 15,53,074 మంది పౌరులకు రేషన్ ప్రయోజనం లభించనుందని చెబుతున్నారు. ఇది పేదల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం అంటూ స్పష్టం చేస్తున్నారు.
ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేటితో ( జూలై 14, 2025 ) రాష్ట్రంలో రేషన్ కార్డుల మొత్తం సంఖ్య 95,56,625కి.. లబ్ధిదారుల సంఖ్య 3,09,30,911కి చేరనుందని వెల్లడించారు. కొత్త కార్డుల జారీతో పాటు పాత కార్డుల్లో అదనంగా చేర్చిన సభ్యుల సంఖ్య కూడా భారీగానే ఉందని తెలిపారు. మొదటి దశలో నారాయణపేట జిల్లాలో గతంలో నిర్వహించిన సభ ద్వారా 2,03,156 కొత్త రేషన్ కార్డులు జారీ చేసి, 5,90,488 మందికి లబ్ధి కలిగించామన్నారు. అలాగే పాత కార్డుల్లో 6,39,784 మందిని అదనంగా చేర్చామని గుర్తు చేశారు. ఈ రెండింటినీ కలిపితే మొత్తంగా 12,30,272 మందికి రేషన్ ప్రయోజనాలు అందించామన్నారు.
ఇప్పుడు ప్రారంభమైన రెండవ దశలో 15.5 లక్షల మందికి పైగా లబ్ధి కలుగనుండగా.. ఇందుకోసం ప్రభుత్వంపై సంవత్సరానికి రూ. 1,150.68 కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మరోవైపు రేషన్ కార్డు మంజూరైందో లేదో తెలుసుకోవాలనుకునే వారు ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం..
ఎలా చెక్ చేసుకోవాలంటే..
epds.telangana.gov.in/FoodSecurityAct కు వెళ్లి, FSC Search చేసి ఆ తర్వాత Ration Card Search ఓపెన్ చేసి FSC Application Search లో మీ MeeSeva Application Number లేదా Application Number ఎంటర్ చేయాలి. "Approved" అని చూపిస్తే మీకోసం కార్డు మంజూరైంది. "Pending" అని వస్తే ఇంకా దరఖాస్తు పరిశీలనలో ఉందని అర్థం.












Click it and Unblock the Notifications