తెలంగాణ కాంగ్రెస్ కొత్త వ్యూహం: ప్రియాంక, డీకేలకు కీలక బాధ్యతలు
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రం తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. రాష్ట్ర నాయకత్వానికి, నేతలకు దిశానిర్దేశం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడంతోపాటు పార్టీ గెలుపు కోసం అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచారాలు, అమలు చేయాల్సిన వ్యూహాల బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కర్ణాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ కార్యదర్శులు తమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. పార్టీ నేతలతో తరతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు వీరికి అదనంగా అగ్రనేతలు ఇద్దరు ముఖ్యులను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ అధిష్ఠానం తరఫున ప్రియాంక గాంధీ, శివకుమార్‌లు రాష్ట్ర పార్టీకి సంబంధించిన అన్ని విషయాల్లోను నిర్ణయాలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అవసరమైన కసరత్తులు ప్రారంభించనున్నారు.
ముఖ్యంగా అన్నింటికంటే నాయకుల మధ్య ఐక్యతను కాపాడటం, వారంత కలిసి పని చేసేలా చూడటం, వ్యూహాల్లో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకురావడం.. ఇలా అన్ని అంశాల్లోను ప్రియాంక, డీకే శివకుమార్.. కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చే సర్వేల నివేదికలూ కీలకంగా మారనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలతో సభలు నిర్వహించడంతోపాటు పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రియాంక గాంధీ, డీకే, శివకుమార్ చూస్తారని తెలిసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం దీనికి సంబంధించి డీకే శివకుమార్ కొందరు నాయకులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ఇది ఇలావుంటే, బీఆర్ఎస్ పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకు సానుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఖమ్మంలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. మరికొంతమంది అధికార పార్టీతోపాటు ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. విభేదాలు వీడి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే రాష్ట్ర నేతలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. మరోవైపు, డీకే శివకుమార్ కూడా తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications