అల్పపీడనం-ఆవర్తనం: తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: రానున్న ఐదు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారిందని, దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వైపు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి , నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

మరోవైపు, పలు జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువ ఎక్కువగా కావడంతో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 15.5 డిగ్రీలకు చేరాయి. హైదరాబాద్ నగరంలో 22.8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 18-21 డిగ్రీల మధ్య ఉంటాయని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31-33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇక, ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీసత్యసాయి, బాపట్ల, కృష్ణా, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతరామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications