హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణంపై కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇచ్చాకే హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణం చేపడతామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
హైదరాబాద్‌కు రూ.17 వేల కోట్ల విలువైన రింగురోడ్డు మంజూరుచేశాం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ తామే చేస్తామని, ఆ వ్యయంలో 50% భరిస్తామని చెప్పింది. ప్రభుత్వం మారాక కొత్త సీఎం వచ్చి దీనిపై చర్చించారు. వారు భూసేకరణ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్ రింగు రోడ్డు నిర్మిస్తామనిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

మరోవైపు, విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే (NH-65) పనులు గతంలో జీఎంఆర్ సంస్థకు దక్కాయని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలాసార్లు వచ్చి కలిశారని చెప్పారు. రహదారి విస్తరణ అంశంపై జీఎంఆర్ సంస్థ, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య పరస్పర కేసులు నడిచాయన్నారు. అవి ఆర్బిట్రేషన్, హైకోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
అయితే, సాధ్యమైనంత త్వరగా దీనికి పరిష్కార మార్గం కనుక్కుంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం పలుచోట్ల రహదారిని మెరుగుపరచడానికి టెండర్లు ఆహ్వానించాం. నెల రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)తో పాటు జాతీయ రహదారి 765లోని హైదరాబాద్-శ్రీశైలం సెక్షన్ ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నట్లు గడ్కరీ తెలిపారు.
తెలంగాణలో రహదారుల అప్‌గ్రెడేషన్‌పై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు జవాబిచ్చారు. మరోవైపు, కరీంనగర్-జగిత్యాల మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణం టెండర్ల దశలో ఉన్నట్లుగా గడ్కరీ తెలిపారు. బిడ్ల ప్రక్రియ పూర్తికావడానికి 5 నెలలు, నిర్మాణ పనులు పూర్తికావడానికి రెండున్నరేళ్లు పడుతుందని వెల్లడించారు. జగిత్యాల-రాయపట్నం మధ్య రహదారి పనులు డీపీఆర్ దశలో ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications