బీజేపీకి కొరుకుడుపడని తెలంగాణ- భారీ షేకప్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగబోతోంది. ఫిబ్రవరి తొలి వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వార్డులు, చైర్‌పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లను ఖరారయ్యాయి. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, బీసీ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లను నిర్ధారించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం- 2019 ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేశారు.
రాష్ట్రంలో మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మిగిలిన పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ చట్టపరమైన, పరిపాలనాపరమైన సమస్యల వలన నిలిచిపోయాయి. ఇప్పటికే తుది ఓటర్ల జాబితాలను విడుదల అయింది. 52.43 లక్షల మంది పట్టణ ఓటర్లు ఉన్నారు. వీరిలో 25.62 లక్షల మంది పురుషులు, 26.8 లక్షల మంది మహిళలు, 640 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

ఈ పరిణామాల మధ్య బీజేపీ కొత్త వ్యూహాలను రూపొందించుకుంటోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కనీస ప్రభావం చూపలేకపోయినందున స్థానిక సంస్థలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. ఈ క్రమంలో కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ దీనిపై దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనేమున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల ఇన్‌చార్జులు, కో-ఇన్‌చార్జులను నియమించారు.
మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమితులు అయ్యారు. రాజస్థాన్ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామీ, రాజ్యసభ ఎంపీ రేఖ శర్మ కో ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. తెలంగాణలో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం పార్టీ వ్యవస్థాగత సంసిద్ధతను బలోపేతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశం.
పార్టీ రాష్ట్రశాఖతో సమన్వయం చేసుకుని ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార నిర్వహణను పర్యవేక్షించనున్నారు. ఈ నేతల అనుభవం, సంస్థాగత వ్యూహాలతో తెలంగాణ ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా సాగుతుందని బీజేపీ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. ముంబై స్థానిక ఎన్నికల విజయం తర్వాత పార్టీ జాతీయ నాయకత్వం ఈ స్థానిక ఎన్నికలపై దృష్టి సారించింది. కీలకమైన మున్సిపల్ ఎన్నికల ముందు వ్యూహాత్మక నియామకాలను చేపట్టింది.












Click it and Unblock the Notifications