ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు’పై కేటీఆర్
హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి
టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతేగాక, ఈ రెండు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా పోటాపోటీ ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అడ్డంగా దొరికిన దొంగలు మొరుగుతున్నారంటూ కేటీఆర్
'అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. వీరికి బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.

కేసీఆర్ ప్రెస్ మీట్ లేనట్లే?
కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపర్చేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు విచారిస్తుండగా.. ఆ ముగ్గురిని ఫాంహౌస్‌లో కలిసిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి నుంచి కూడా ముఖ్యమంత్రి అధికారిక భవనం ప్రగతి భవన్‌లోనే ఉండటం గమనార్హం. వారితో సీఎం కేసీఆర్ కీలక చర్చలు జరుపుతున్నారు. ఈరోజు కేసీఆర్ మీడియా సమావేశం ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ.. అదేమీలేనట్లుగానే తెలుస్తోంది. కేటీఆర్ ట్వీట్ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందించేందుకు కాస్త టైమ్ తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు, అరెస్ట చేసిన ముగ్గురు వ్యక్తులు నందకుమార్, సింహయాజి, సతీష్ శర్మలను పోలీసులు కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు. వారికి ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications