సుశీ ఇన్‌ఫ్రా నుంచి డబ్బుల బదలాయింపుపై ఆధారాల్లేవు: ఈసీ క్లారిటీ
హైదరాబాద్: సుశీ ఇన్‌ఫ్రా నుంచి డబ్బుల బదలాయింపుపై ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మునుగోడు ఉపఎన్నిక సందర్బంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పలువురు వ్యక్తులు, సంస్థలకు సుశీ ఇన్‌ఫ్రా నగదు బదిలీ చేసిందంటూ టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రూ. 5.24 కోట్ల నగదు లావాదేవీలపై సోమవారం సాయంత్రం 4 గంటలలోగా సమాధానం ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది. సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే, ఈసీ నోటీసులకు రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఈసీ పేర్కొంది. టీఆర్ఎస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేసింది. మరోవైపు, మునుగోడు ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, బీజేపీ నాయకులు డబ్బులను మునుగోడు పరిధిలోని వ్యక్తులకు చెందిన వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని మంత్రి కేటీఆర్ ఇటీవల పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని సుశీ ఇన్‌ఫ్రా ఎండీ సంకీర్త్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా, ఈసీ కూడా స్పష్టతనివ్వడంతో రాజగోపాల్ రెడ్డికి మరింత ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications