బీటెక్ విద్యార్థిని దేవి మృతి: వీడుతున్న మిస్టరీ, పోలీసుల యానిమేటెడ్ వీడియో
హైదరాబాద్: జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ రోడ్డులో గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని దేవి కేసులో పోలీసులు మరిన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నారు. కారు నడిపిన భరతసింహా రెడ్డితో పాటు వారితో ఉన్న స్నేహితులు సోనాలి, విక్కీ, పృథ్వీలను శనివారం విచారించారు.
మద్యం మత్తులో ఉన్న భరతసింహా రెడ్డి, దేవిరెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, కారులో నుంచి దేవి బయటకు రావడానికి గల కారణాలు, వాటికి రుజువులను పోలీసులు సేకరించారు.
దీంతో పాటు నార్సింగి సమీపంలోని బీపీఎం పబ్ నుంచి జర్నలిస్ట్ కాలనీ రోడ్డు వరకు కారులో వారిద్దరి ప్రయాణాన్నియానిమేషన్ ప్రక్రియ ద్వారా వీడియో చిత్రీకరించారు.
వేగంగా కారు నడిపితే ప్రమాదం జరుగుతుందని, చనిపోయేందుకు అవకాశాలున్నాయని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన భరతసింహా రెడ్డిపై బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ పైన నమోదు చేసిన సెక్షన్లను నమోదు చేశారు.
కేసు విచారణ తీరును వివరించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, దేవి తల్లిదండ్రులు, భరత్ తల్లిదండ్రులను సికింద్రాబాదులోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి శనివారం పిలిపించారు. వారికి నిజానిజాలను చెప్పడంతో పాటు భరత్ - దేవి మధ్య సాన్నిహిత్యం, ఇతర అంశాలను చెప్పారని తెలుస్తోంది.
బీపీఎం పబ్బులో మద్యం తాగాక ఇంటికి వచ్చే క్రమంలో భరతసింహా రెడ్డి, దేవి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు విచారణలో వెల్లడైందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేవి కారులో నుంచి దిగి గట్టిగా అరవడం, భరతసింహా రెడ్డి కిందకు దిగి ఆమెను బలవంతంగా కారులోకి లాక్కెళ్లగా.. దీనిని ప్రత్యక్ష సాక్షి రాము చూశాడని భావిస్తున్నారు.

రాము చెప్పిన వివరాలతో వాగ్వాదం జరిగింది వాస్తమేనని, అయితే కారణాలపై స్పష్టత లేదు. ఈ విషయంపై భరతసింహారెడ్డిని ప్రశ్నించగా... అప్పుడు తాను మద్యం మత్తులో ఉన్నానని, నిద్ర వస్తుంటే తొందరగా వదిలేసి వెళ్దామన్న భావనతో గొడవపడ్డానని వేర్వేరు సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది.
మరోవైపు భరత్‌సింహారెడ్డి, దేవీ మాట్లాడుకుంటున్నప్పుడే దేవి తండ్రి నిరంజన్ ఫోన్ చేయడంతో ఆమె భయపడి భరత్‌సింహా రెడ్డితో గట్టిగా మాట్లాడి ఉంటుందా? అని అనుమానిస్తున్నారు.
తండ్రి ఫోన్ చేసినప్పుడు స్నేహితురాలు సొనాలితో ఉన్నానని, రెండు నిమిషాల్లో వస్తానని చెప్పిందని, అయితే కారులో ఇంటికి వెళ్తే బాల్కనీలో ఉన్న తండ్రి చూస్తాడని నడిచి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వాగ్వాదం తలెత్తి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ అంశాలతోపాటు ప్రమాదం జరిగేందుకు ముందు వీరిద్దరి స్నేహితులు ఎక్కడున్నారని తెలుసుకునేందుకు సుమారు 2,500 ఫోన్ కాల్స్, టవర్ లొకేషన్స్ చూశారు. ప్రమాదానికి ముందు కారులో ఇద్దరే ఉన్నట్టు నిర్ధరించారు.
ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన రోజు దేవి, భరతసింహా రెడ్డితో నాలుగుసార్లు మాట్లాడారు. బీపీఎం పబ్‌లో పార్టీకి పాసులున్నాయని, అందరం వెళ్దామని, గచ్చిబౌలిలో సోనాలి ఇంటికి నేను వస్తానని, అక్కడ నన్ను పికప్ చేసుకోమని దేవి చెప్పినట్లుగా విచారణలో తేలిందని తెలుస్తోంది.
దీంతో కారులో సోనాలి, విశ్వనాథ్, భరత్, దేవీలు శనివారం రాత్రి పబ్‌కు వెళ్లారు. అక్కడ విక్కీ, పృథ్వీకలిశారు. పార్టీ అయ్యాక రాత్రి మూడు గంటల సమయంలో విశ్వనాథ్ తన స్నేహితుడితో ఇంటికి వెళ్లగా... సోనాలి తన సోదరితో వెళ్లిపోయింది. భరత్, దేవీ మాత్రమే కారులో దేవి ఇంటికి బయలుదేరారని తెలుస్తోంది.
ఇధిలా ఉండగా, దేవీ, భరతసింహా రెడ్డికి తొమ్మిది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారు. వీరిమధ్య వాట్సాప్‌లో నిత్యం టచ్‌లో ఉండేవారు. కేవలం మూడు నెలల్లోనే వందలపుటల సంభాషణలు, చిత్రాలను పోలీసులు బయటకు తీశారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న చిత్రాలు, సంభాషణలు ఉన్నట్టు తెలిసింది. వీటినే వారి తల్లిదండ్రులకు చూపించినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications