హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీర్ల తయారీకి జల గండం: తగ్గిపోతున్న ఉత్పత్తి, పలు కంపెనీలు తాత్కాలిక మూసివేత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/మెదక్: ప్రస్తుతం బీర్ల తయారీకి జలగండం వచ్చి పడింది. నీరు లభించక పలు బీరు కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మెదక్ జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లెపల్లి, గుంతపల్లి గ్రామాల శివార్లలో క్రౌన్, కాల్స్‌బర్గ్, యూబి, ఖజూర బీరు పరిశ్రమలు నీటి కొరతతో ఉత్పత్తిని తగ్గించుకుంటూ పోతున్నాయి.

కాగా, ఖజూర పరిశ్రమ లాకౌట్ పడింది. పుల్కల్ మండలం శివ్వంపేట గ్రామ శివారులో మంజీర నది పరివాహక ప్రాంతంలో చార్మినార్ బ్రూవరీస్ బీర్ల ఉత్పత్తి చేస్తోంది. చార్మినార్ బ్రూవరీస్ యాజమాన్యం నదిలో ప్రవహించే రా వాటర్‌ను శుద్ధి చేసుకుని నీటి అవసరాలు తీర్చుకుంటోంది. అయితే, ప్రస్తుతం నదిలో నీరు ప్రవహించే పరిస్థితి లేకపోవడంతో ఈ పరిశ్రమకు నీటి కష్టాలు తప్పేలా లేవు.

కొండాపూర్ మండలంలో ఉన్న బీరు పరిశ్రమలకు సింగూర్ నుండి హైదరాబాద్‌కు సరఫరా చేసే పెద్దాపూర్ ఫిల్టర్ బెడ్ నుండి నీటిని అందిస్తున్నారు. ఒక్కో పరిశ్రమకు సరాసరి రోజుకు 60 వేల లీటర్ల చొప్పున మంజీర నీటిని సమకూరుస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఇచ్చే అనుమతికి అనుగుణంగా పరిశ్రమల్లో బీర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

no water for beer production in hyderabad

యుబి పరిశ్రమ నెలకు పది లక్షల కేసుల బీర్లను తయారు చేస్తుండగా, క్రౌన్‌లో 4 లక్షలు, కాల్స్‌బర్గ్‌లో 5 లక్షల కేసుల వరకు బీర్ల ఉత్పత్తి జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సింగూర్ ప్రాజెక్టులో నీరు అడుగంటిపోయింది. దీంతో జంట నగరాలకు సైతం సింగూర్ నీటి సరఫరాను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది.

అధికారుల లెక్క ప్రకారం సింగూర్‌లో 1.5 టిఎంసిల నీరు ఉందని చెబుతున్న ప్రాజెక్టులో నీరు అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే బీరు పరిశ్రమలకు డిసెంబర్ 1వ తేదీ నుండి నీటి సరఫరా నిలిపివేస్తున్నామని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు యాజమాన్యాలకు నోటీసులు అందజేశారు. ఆందోళన చెందిన పరిశ్రమల యాజమాన్యాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. రెండు, మూడు నెలల వరకు బీర్ల లభ్యతకు కొరత ఉండకపోయినా భవిష్యత్‌లో బీరు లభించని పరిస్థితి నెలకొననుంది.

కాగా, బోర్లు తవ్వుకునేందుకు పరిశ్రమ యాజమాన్యాలకు వాల్టా చట్టం మొకాలడ్డుతోంది. బీర్ల ఉత్పత్తి నిలిచిపోతే ఎక్సైజ్ శాఖ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

4పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడుకోవడం, కార్మికులకు ఉపాధి కల్పించడం, మద్యం ప్రియులకు బీరు కొరత రాకుండా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఎక్సైజ్ శాఖ శ్రీకారం చుట్టినట్లు సమాచారం.

నగరానికి చేరుకున్న గోదావరి జలాలనైన అందించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. లేనిపక్షంలో చల్లని బీరు ధరలు ఒక్కసారిగా వేడెక్కవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

బీర్ల పరిశ్రల్లో ఉత్పత్తి నిలిచిపోతే రోజుకు వందల సంఖ్యలో తిరిగే ట్రాన్స్‌పోర్టు వాహనాలు కూడా కనిపించకపోవచ్చు. దీంతో హమాలీలు, డ్రైవర్లు, క్లీనర్ల బతుకులు భారంగా మారే ప్రమాదం పొంచివుంది. ప్రభుత్వం నీటి ఎద్దడిని నివారించే చర్యలు చేపడితేనే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది.

English summary
It said that no water for beer production in Medak and Hyderabad districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X