సీఎం రేవంత్ సంకల్పం గట్టిది బ్రో.. HCL కొత్త క్యాంపస్ ప్రారంభం..!!
తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని మాదాపూర్‌లో ప్రముఖ బహుళజాతి సంస్థ హెచ్‌సీఎల్ టెక్ నూతన క్యాంపస్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేసిన సీఎం..ప్రతిరోజూ తెలంగాణ ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో లేదా బడా కంపెనీలు తెలంగాణకు రావడమో జరుగుతోందని గుర్తుచేశారు. గతేడాది సంతకం చేసిన ఎంఓయూల కొత్త సౌకర్యాలను ప్రారంభించడం కూడా జరుగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పిన సీఎం... కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు.ఉద్యోగ కల్పనలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచామని, అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ వద్ద ఉందని చెప్పారు. ఇక తెలంగాణలో అత్యల్ప ద్రవ్యోల్బణం ఉందని గుర్తుచేశారు.తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తామని తాను చెప్పినప్పుడు అది సాధ్యపడదంటూ కొందరు చెప్పిన విషయాన్ని సీఎం రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రెండుసార్లు దావోస్ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తరువాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారని చెప్పారు.

రైజింగ్ తెలంగాణ
తమ పోటీ ముంబై,ఢిల్లీ,బెంగళూరు లేదా చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు... కొంతమంది అది పెద్ద కలనే అవుతుందన్నారు. "మనం ఈవీ అడాప్షన్ లో హైదరాబాద్‌ను నంబర్ వన్‌గా చేశాక... రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్‌కు హబ్‌గా మారుస్తున్నాం. ఇప్పుడు హైదరాబాదు రైజింగ్ ఆగదని ప్రజలే అంటున్నారు" అని రేవంత్ చెప్పుకొచ్చారు. తాను మొదట తెలంగాణ రైజింగ్ అని చెప్పినప్పుడు కొందరు అపహాస్యం చేశారని ఇప్పుడు ప్రపంచం మొత్తం దీన్ని అంగీకరిస్తోందని అన్నారు.
గ్లోబల్ కంపెనీగా HCL
ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్ ను కొద్దిరోజుల క్రితం ప్రారంభించుకున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి... ప్రపంచంలోనే అత్యుత్తమ సమావేశాలలో ఒకటైన బయో ఏషియా సదస్సును విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అదే సమయంలో నేడు హెచ్‌సీఎల్ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. గ్లోబల్ కంపెనీగా హెచ్‌సీఎల్ టెక్ భారతదేశానికే గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు. 60దేశాల్లో హెచ్‌సీఎల్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని, ఇందులో 2.2 లక్షల మంది ఉద్యోగస్తులున్నారని చెప్పారు. డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, ఏఐ రంగాల్లో వరల్డ్ క్లాస్ ఆఫరింగ్స్ క్రియేట్ చేస్తుండటంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

2007లో హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా HCL పెద్ద స్థాయికి ఎదిగింది.ఇవాళ 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 5 వేల మందితో కేఆర్ సీలో ప్రపంచస్థాయి సదుపాయంతో హెచ్ సీఎల్ టెక్ హైదరాబాద్ లో గొప్ప పనులు చేస్తుంది.












Click it and Unblock the Notifications