రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుపై డీసీపీ వినిత్ ఏమన్నారంటే?: క్రిష్ వివరణ
హైదరాబాద్: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఆ హోటల్‌లో చాలా సార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పారని తెలిపారు. నిందితుల్లో వివేకానంద, కేదార్, నిర్భయ్ కొకైన్ సేవించినట్లు పరీక్షల్లో తేలిందన్నారు. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వివేకానందకు అబ్బాస్ 10 సార్లు కొకైన్‌ను డెలివరీ చేశాడని డీసీపీ చెప్పారు. ఈ కేసులో నిందితులైన లిపి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. చరణ్ బెంగళూరులో ఉన్నట్లు తెలిసిందన్నారు. అయితే, సినీ దర్శకుడు క్రిష్ ఆ పార్టీలో పాల్గొన్నట్లుగా పూర్తిగా నిర్ధరణ కాలేదని డీసీపీ వినిత్ తెలిపారు. విచారణకు హాజరవుతానని కిష్ తెలిపారని డీసీపీ వెల్లడించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు యువతులు సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

డ్రగ్స్ పార్టీలో పాల్గొనలేదు: డైరెక్టర్ క్రిష్
తాను రాడిసన్ హోటల్‌కు వెళ్లింది నిజమేనని.. అయితే, డ్రగ్స్ పార్టీలో పాల్గొనలేదని, ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని సినీ దర్శకుడు క్రిష్ స్పష్టం చేశారు. డ్రగ్స్ పార్టీ జరిగిన సమయంలో తన స్నేహితులు రాడిసన్ హోటల్లో ఉన్నారని.. వారిని కలవడానికి మాత్రమే తాను అక్కడికి వెళ్లానని తెలిపారు. రాడిసన్ హోటల్‌లో 45 నిమిషాలు మాత్రమే ఉన్నానని.. పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదని క్రిష్ స్పష్టం చేశారు. క్రిష్ పరారీలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆయన ఈ మేరకు స్పందించారు.












Click it and Unblock the Notifications