టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి కీలక ముందడుగు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణక్ష్ం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బీ జనార్ధన్ రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డిల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
వారి రాజీనామాలు ఆమోదం పొందిన నేపథ్యంలో ఛైర్మన్, సభ్యుల నియామకానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ 1 తోపాటు పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో కమిషన్ తీరుపై అభ్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్ ద్వారా తస్కరించినా గుర్తించడంలో విఫలమైందని, పటిష్టమైన కంప్యూటర్ వ్యవస్థ లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే కమిషన్ ఛైర్మన్‌ను తొలగించి, బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిసెంబర్ 11న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు.
ఆ తర్వాత మరో ముగ్గురు సభ్యులు రాజీనామాలు సమర్పించారు. జనవరి 10న వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్త ఛైర్మన్, సభ్యుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.












Click it and Unblock the Notifications