కేసీఆర్‌తో మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భేటీ: వాజపేయి సర్కారును కూల్చిన వ్యక్తి!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)ను ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రగతిభవన్‍లో సీఎంతో రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. దేశంలో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలను చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కోసం కేసీఆర్ వరుస భేటీలు
టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు, జాతీయ నాయకులతో కేసీఆర్ సమావేశాలు జరిపిన విషయం తెలిసిందే. బీజేపీ, ఎన్డీఏయేతర, కాంగ్రెస్ యేతర శక్తులను కూడగట్టే పనిలో ఉన్నారు. సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ కార్యకలాపాలను తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

వాజపేయి సర్కారును పడగొట్టిన వ్యక్తే ఈ గిరిధర్ గమాంగ్
కాగా, 1999, ఏప్రిల్ 17వ తేదీన జరిగిన అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్ కావడం గమనార్హం. ఈయన 9సార్లు పార్లమెంటుకు ఎన్నిక కావడం విశేషం. కాగా, గమాంగ్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
ఆ సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి నాటి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 1999లో పార్టీ ఆదేశాల మేరకే వాజపేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశానని ఆయన వెల్లడించారు.
అయితే కొద్ది రోజుల్లోనే ఆయనను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. అంతేకాకుండా ఆయన కుమారడు శిశిర్ గమాంగ్‌ను కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ బీజేపీ గూటికి చేరారు. బీజేపీలో ఆయన ప్రస్తుతం క్రియాశీలకంగా లేరు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఒడిశా బీఆర్ఎస్ బాధ్యతలు గమాంగ్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

జాతీయ రాజకీయాల్లో కీలకంగా కేసీఆర్ ఖమ్మం సభ
ఇప్పటికే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. ఏపీలో కూడా పర్యటించనున్నట్లు తెలిపారు. మరోవైపు, జనవరి 18న ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ నేతలు, రైతు సంఘాల నేతలు హాజరుకాబోతున్నారు. దేశ రాజకీయాల్లో ఖమ్మం బహిరంగ సభ కీలకంగా మారనుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications