రుణమాఫీ అమలులో కొత్త మెలిక - కటాఫ్ తేదీ ఖరారు, వీరికి లేనట్లే..!!
తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. అధికారంలోకి వస్తే రూ 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆగస్టు 15 నాటికి అమలు ఖచ్చితంగా జరుగుతుందని తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ హామీ ఇచ్చారు. ఇప్పుడు నిధుల సమీకరణతో పాటుగా అమలు విధి విధానాల పైన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అధికారుల ప్రతిపాదనలు
రుణమాఫీకి సంబంధించి అధికారులు ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించారు. అమలు ఎప్పటి నుంచి వర్తింపచేయాలనే దాని పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, తాజాగా 2018 డిసెంబర్ 12నుంచి తీసుకున్న రుణాలు, రెన్యువల్ అయిన వాటికి మాఫీ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే సమయంలో లబ్దిదారుల విషయంలో పాస్ బుక్ లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను రుణమాఫీ నుంచి మినహాయించారు.

భారం తగ్గేలా కసరత్తు
ఈ వారంలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదన పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రూ 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల వివరాలను ప్రభుత్వం బ్యాంకుల నుంచి సేకరించింది. ముందుగా రుణమాఫీ అమలు ఎవరికి అమలు చేయాలనే దాని పైన ఒక నిర్ణయానికి రానున్నారు. ఆ తరువాత బ్యాంకుల నుంచి వచ్చిన వివరాల పైన కసరత్తు చేసి అర్హుల సంఖ్య..చెల్లించాల్సిన మొత్తంపైన ఒక స్పష్టత రానుంది. దీనిపైన వ్యవసాయ -ఆర్దిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మంత్రివర్గ భేటీలో నిర్ణయం
రైతుబంధు పధకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. వారిలో 2 లక్షల వరకు రుణం పొందిన వారి సంఖ్య ఇదే స్థాయిలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతుబంధు లబ్దిదారుల్లో ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్ బుక్ లు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుంది. రేషన్ కార్డు నిబంధన పెడితే ఒకే కుటుంబంలో ఉన్న లబ్దిదారుల్లో కుటుంబ పెద్దకు మాత్రమే అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నారు. దీని ద్వారా మరో 18లక్షల మంది తగ్గనున్నారు. దీంతో.. ఈ మొత్తం లెక్కలు..అమలు పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు.












Click it and Unblock the Notifications