వృద్ధురాలు అని కూడా చూడకుండా..!!!
సైబర్ నేరగాళ్ల అల్లర్లు రోజురోజుకు మితి మీరిపోతున్నాయి. ఇప్పుడు "డిజిటల్ అరెస్ట్" అనే కొత్త పద్ధతితో అమాయకుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 17 2025న వెలుగులోకి వచ్చిన ఘటనలో హైదరాబాద్‌లోని ఓ రిటైర్డ్ మహిళా డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. నిజానికి డిజిటల్ అరెస్ట్ అనే పదం ఎక్కడా చట్టంలో లేదని తెలిసిన విషయమే.
వీడియో కాల్‌లో పోలీసుల వేషం..
ఒంటరిగా జీవిస్తున్న ఆ వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. తాము పోలీసులమని పరిచయం చేసుకుంటూ.. ఆమెపై మనీలాండరింగ్, డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఉన్నాయంటూ భయపెట్టారు. మీపై విచారణ జరుగుతోంది, మేము మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని హెచ్చరించారు.

మూడురోజుల భయాందోళనలు..
సైబర్ నేరగాళ్లు ఆమెను మూడు రోజుల పాటు నిరంతర ఒత్తిడికి గురిచేశారు. వీడియో కాల్ ఆఫ్ చేయొద్దు, మేము మిమ్మల్ని పర్యవేక్షిస్తున్నాం అంటూ నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన వృద్ధురాలు తీవ్ర మానసిక ఆందోళనకు లోనయ్యారు.
రూ.6.5 లక్షలు చెల్లించిన వృద్ధురాలు..
అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు చెల్లించాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు. వారు చెప్పిన అకౌంట్లలో వృద్ధురాలు మొత్తం ₹6.5 లక్షలు జమ చేశారు. కానీ, డబ్బు తీసుకున్న తర్వాత కూడా బెదిరింపులు ఆగలేదు. ఇంకా డబ్బు పంపాలని ఒత్తిడి చేయడంతో ఒత్తిడిని తట్టుకోలేక ఆ వృద్ధురాలు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం వారి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.
ఈ మేరకు తల్లి మరణ వార్త విన్న కొడుకు హైదరాబాద్ చేరుకుని ఆరా తీశాడు. డబ్బులు సైబర్ నేరగాళ్లకు బదిలీ చేసిన విషయం బయటపడటంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లి మరణానికి నేరగాళ్లే కారణమని ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే వెంటనే డిస్‌కనెక్ట్ చేసి.. పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఎటువంటి సందర్భంలోనూ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ సమాచారం, డబ్బులు ఇవ్వకూడదని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.












Click it and Unblock the Notifications