Oneindia Exclusive:డ్రగ్ డీలర్ల తాట తీస్తాం..యువత జాగ్రత్త: సీపీ అవినాష్ మొహంతి వార్నింగ్..!
తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ మహమ్మారి కుదిపేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికేవి. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి విముక్తి కలిపించి యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న రేవంత్ ఆలోచన మంచి ఫలితాలను ఇస్తోంది. రేవంత్ ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపుతోంది. ఈ మధ్యే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు కొత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్ మాదకద్రవ్యాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దుతామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు కఠిన చట్టాలను తీసుకొస్తామని వెల్లడించారు.
వన్ ఇండియాతో సీపీ అవినాష్ మొహంతి..
ఐటీ కారిడార్‌లో ఎక్కువగా కనిపించే ఈ డ్రగ్స్ కల్చర్‌పై డేగ కన్నుతో వ్యవహరిస్తోంది సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం.బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్,మాదాపూర్ గచ్చిబౌలి లాంటి కాస్లీ ప్రాంతాల్లో ఎక్కువగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు గతంలో చూశాం.అయితే డ్రగ్స్ వినియోగాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేదానిపై వన్ ఇండియాతో ప్రత్యేకంగా పంచుకున్నారు సైబరబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి.

డ్రగ్స్ ఆందోళనకరమే కానీ..
మే నెల వరకు మొత్తం 181డ్రగ్స్ కేసులను సైబరాబాద్ పోలీసులు నమోదు చేసినట్లు చెప్పారు మొహంతి.ఇక 340 మందిని డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్నట్లుగా తెలుసుకుని వారిని అరెస్టు చేయడం జరిగిందని, 1000 కేజీల వరకు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వారి అరెస్టు సంఖ్యను చూస్తే పెద్దగా అనిపించదు అదేసమయంలో కనిపించదు. పంజాబ్, గోవా, దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా డ్రగ్స్ వినియోగం ఉంది. అక్కడ అయ్యే అరెస్టులతో పోలిస్తే సంఖ్యాపరంగా తెలంగాణది చాలా తక్కువని చెప్పిన సీపీ...డ్రగ్స్ మహమ్మారికి యువత బలవుతోందనేది చాలా ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు. డ్రగ్స్ పట్ల అవగాహన లేని అమాయకపు యువత ఈ రొచ్చులోకి దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారు తీసుకునే మోతాదు శరీరానికి ఎలాంటి హానీ తలపెడుతుందో అనేదానిపై యువతకు అవగాహన లేక ఇందులో చిక్కుకుంటున్నారని సీపీ అవినాష్ మొహంతి చెప్పారు. ఆరోగ్యానికి ఇది చేటు చేస్తుందన్న విషయాన్ని యువత మరిచిపోతోందని వివరించారు.
డ్రగ్స్ సిటీలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి..
అసలు డ్రగ్స్ మహమ్మారి ఇంతలా వ్యాప్తి చెందిందంటే దీనికి విత్తనం ఎక్కడపడిందనేది ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని సీపీ అవినాష్ మొహంతిని ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు. భవన నిర్మాణపు పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాదుకు వచ్చే రోజువారీ కూలీలకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండే అవకాశం ఉందని అన్నారు. వారు చేస్తున్న పనికి ఒళ్లు నొప్పులు వస్తే దాన్నుంచి విముక్తి పొందేందుకు ఈ డ్రగ్స్ తీసుకుంటారని మొహంతి చెప్పారు.మరోవైపు మాదకద్రవ్యాలను వినియోగించే వారిలో చదువుకునే విద్యార్థులు సైతం ఉన్నారని వెల్లడించారు. చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురై,మానసిక క్షోభను అనుభవిస్తున్న వారు దీన్నుంచి బయటపడేందుకు ఈ మత్తుపదార్థాలను అలవాటు చేసుకుంటున్నారని సీపీ వెల్లడించారు. ఇక రాష్ట్రంలోకి ఈ డ్రగ్స్ మహమ్మారి ఎలా ప్రవేశిస్తోందన్నది గమనిస్తే.. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్ర ఒడిషా సరిహద్దు ఉంది. ముఖ్యంగా గంజాయి ఈ సరిహద్దు నుంచే రాష్ట్రంలోకి ప్రవేశిస్తోందని చెప్పారు. మరోవైపు ఓపియాడ్స్ సింథటిక్ డ్రగ్స్ రాజస్థాన్, గోవా, బెంగళూరు నుంచి స్మగ్లింగ్ ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని వెల్లడించారు.

హాష్ ఆయిల్‌లో డ్రగ్స్ రవాణా
ఇక పోలీసుల నిఘా గట్టిగా ఉండటంతో డ్రగ్స్ సరఫరాదారులు అధునాతన మార్గాల్లో మాదకద్రవ్యాలను సప్లయ్ చేస్తున్నారని అవినాష్ మొహంతి చెప్పుకొచ్చారు.హాష్ ఆయిల్‌లో ఈ డ్రగ్స్‌ను కలిపి సిటీలోకి సప్లయ్ చేస్తున్నారని అవినాష్ మొహంతి చెప్పారు. నేరుగా గంజాయి మొక్కలు కాకుండా హాష్ ఆయిల్‌లో కలిపి తీసుకురావడాన్ని పోలీసులు కనుగొన్నారని వివరించారు.ఇలా చేయడం చాలా సురక్షితం అదే సమయంలో రవాణా కూడా సులభంగా జరిగిపోతుందనే అభిప్రాయంతో స్మగ్లర్లు ఉన్నారని చెప్పారు.ఇక డ్రగ్స్‌కు సిటీలో కొన్ని ప్రధాన కూడళ్లు ఉండేవని అవి హాట్ స్పాట్స్‌గా నిలిచేవని చెప్పిన అవినాష్ మొహంతి.. గత పదేళ్లుగా హాట్ స్పాట్స్‌ను వదిలి చాలా రహస్యంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా అనుమానం రాకుండా స్మగ్లర్లు సప్లయ్ చేస్తున్నారని అవినాష్ మొహంతి చెప్పారు.
డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం
సైబరాబాదులో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టి అక్కడ పోలీసులు వాహనాలను సోదా చేస్తున్నారు.అయితే డ్రగ్స్ వినియోగం, కొనుగోళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అవినాష్ మొహంతిని వన్ ఇండియా ప్రశ్నించింది."మూడు ప్రధాన మార్గాల ద్వారా ఆపరేషన్ నిర్వహిస్తున్నాం.ముందుగా మాకు అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.అంతేకాదు సాధారణ పౌరుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది.అయితే డ్రగ్స్ తక్కువ స్థాయిలో ఉందా లేక పెద్ద మొత్తంలో ఉందా అనేది కాకుండా వెంటనే చర్యలు తీసుకుంటాం.రెండవది ఎవరూ ఊహించని చోట్ల చెక్‌పోస్టులను పెట్టి అక్కడ చెక్కింగ్ నిర్వహిస్తాం.ఈ చెక్‌పోస్టుల సంఖ్య కూడా పెంచాం.పబ్స్, ఈటరీస్, ఫామ్ హౌజ్‌లలో ఎక్కువగా ఇలాంటి క్రిమినల్ కార్యకలాపాలు జరుగుతుంటాయి. వీటిపై నిఘాను పెంచాం. విద్యాసంస్థల పరిసరాల్లో, భవన నిర్మాణాల పరిసరాల్లో చెకింగ్‌ను ఉధృతం చేశాం. డ్రగ్స్ సప్లయర్స్, స్మగ్లర్స్,డీలర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నాం.వారిని వదిలే ప్రసక్తే లేదు. ఈ క్రమంలోనే దాదాపు 1000 కిలోల డ్రగ్స్‌ను కేవలం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే స్వాధీనం చేసుకున్నాం" అని మహంతి చెప్పారు.

కౌన్సిలింగ్‌కు ప్రాధాన్యత
డ్రగ్స్‌కు అలవాటు పడ్డ వ్యక్తి ఏదో కారణం చేతనే అలవాటు చేసుకున్నట్లు చాలా కేసుల్లో తేలింది.అందుకే పునరావాస పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ రస్క్ ఓ సందర్భంలో ఒక మాట చెప్పారు. అలవాటును చంపడానికి ముందు మూలాలను చంపండని చెప్తారు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డ ప్రతి వ్యక్తి వెనక పెద్ద గాయమే ఉంటుందని మహంతి చెప్పారు. ఆ బాధ నుంచి బయటపడేందుకే డ్రగ్స్‌ను అలవాటు చేసుకుంటున్నారని చెప్పారు.అందుకే డ్రగ్స్ అలవాటున్న వ్యక్తిని ఒక అంటరానివాడిగా చూడకుండా అతన్ని సరైన మార్గంలోకి తీసుకొచ్చేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని మొహంతి చెబుతున్నారు.ఇది ప్రభుత్వం పోలీసు శాఖ ఇప్పటికే చాలా చేస్తోందన్నారు.విద్యాసంస్థలు, కుటుంబాలు కూడా బాధ్యత తీసుకుని మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచి పారేయాలని మొహంతి పిలుపునిచ్చారు.డ్రగ్స్ సరఫరా చేస్తున్న డీలర్ల పట్ల పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని అయితే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని మాత్రం పునరావాస కేంద్రానికి తరలించి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చే బాధ్యతను తీసుకుని వారికి మరోజన్మను ప్రసాదిస్తోందని వెల్లడించారు.

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు సమాజం ఏకం కావాలని పిలుపునిచ్చారు.మాదక ద్రవ్యాలకు బానిసగా మారినవారిని అసహ్యించుకోవడం మానేసి వారితో ప్రేమపూర్వకంగా మెలగాలని అన్నారు.వారిని అంటరానివారిగా చూస్తే వారు మరింతగా ఈ డ్రగ్స్‌కు అలవాటు పడిపోయి దాన్నుంచే బయటకు రాలేనంత బానిసలా తయారవుతారని చెప్పారు. డ్రగ్స్‌కు బానిసైన వారితో మంచిగా మాట్లాడి దీనివల్ల జరిగే నష్టం ఎలాంటిదో నెమ్మదిగా వివరించి వారిని గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలని ఇలాంటి ప్రయత్నం కచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి.












Click it and Unblock the Notifications