OPINION: తెలంగాణలో "కారు" కదలాలంటే "కమలం" తో కలవాల్సిందేనా..?

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత కుదుపులకు గురవుతోంది. అయితే తాజా రాజకీయ పరిస్థితుల్లో గులాబీ పార్టీ కమలం పార్టీతో జతకట్టబోతోందనే వార్త ప్రచారంలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ దోస్తీపై 2018 నుంచే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అలాంటిదేమీ కనిపించలేదు.

ఇక తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు గమనిస్తే.. మాజీ సీఎం కేసీఆర్ కూతురు మద్యం కుంభకోణంలో అరెస్టు కావడం, మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ దక్కించుకోకపోవడం, కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం వంటి అంశాలు బీఆర్ఎస్ క్యాడర్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక వ్యూహాత్మకంగా అడుగులు వేసే సమయం వచ్చిందని గులాబీ పార్టీ భావిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, ఓబీసీ సామాజిక వర్గాలు బీఆర్ఎస్ వెంటే నడిచారు. కానీ మారిన పరిస్థితుల్లో వీరంతా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు.

OPINION BJP-BRS COMING TOGETHER LAST RAY OF HOPE

ఇక బీజేపీ విషయానికొస్తే మొత్తం 17 పార్లమెంటు స్థానాలున్న తెలంగాణలో 8 సీట్లను కైవసం చేసుకుంది. అయితే 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అదే ఊపును కొనసాగించి ఉంటే మరిన్ని సీట్లను పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ గ్యాప్‌ను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసింది. క్యాడర్‌ సమన్వయ లోపం, 119 అసెంబ్లీ స్థానాల్లో సరైన అభ్యర్థులు లేకపోవడం, బలమైన లక్ష్యం లేకపోవడం వంటి అంశాలు బీజేపీని ఎదగకుండా చేశాయనేది స్పష్టమవుతోంది.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో క్రమంగా ప్రాభవం కోల్పోతున్న బీజేపీకి మొన్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 సీట్లు రావడం ఆ పార్టీకి ఒక్కింత బలం చేకూరినట్లయింది. దీంతో తెలంగాణలో బలపడేందుకు అన్ని రకాల వ్యూహాలను కమలం పెద్దలు అమలు చేసే పనిలో పడ్డారు.

ఆపరేషన్ లోటస్

తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో అక్కడ పాగా వేసే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది. అక్కడ అప్పటికే కాస్తో కూస్తో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో జతకట్టే ప్లాన్ చేస్తోంది. ముందుగా జతకట్టడం ఆ తర్వాత తన మార్క్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాంతీయ పార్టీని తనలో కలిపేసుకుపోవడం వంటి వ్యూహాలతో కమలం పార్టీ ముందుకెళుతోంది.ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌తో జతకట్టి తెలంగాణలో బలపడాలన్న ఆలోచనతో కాషాయం పార్టీ ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో బీర్ఎస్ బీజేపీల మొత్తం ఓటు షేరు 51.25శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్‌ వద్ద ఉన్న ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వీరి ఓటు షేరు 40శాతం అని చెప్పొచ్చు.

OPINION BJP-BRS COMING TOGETHER LAST RAY OF HOPE

మైనార్టీ కార్డు

తెలంగాణలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 13శాతంగా ఉన్నారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో నువ్వ నేనా అన్నట్లుగా సాగే పోరులో 45 స్థానాల్లో ముస్లిం ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే అంశం బీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. బీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీగా గుర్తింపు ఉండటంతో పాటు మజ్లిస్‌తో కూడా స్నేహపూర్వకమైన సంబంధాలు కలిగి ఉండటంతో 2014,2018లో గులాబీ పార్టీకి కలిసొచ్చింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్‌కు 37.35శాతం ఓట్లు రాగా అందులో ముస్లిం ఓటర్లు భాగస్వామ్యం మెండుగా ఉందనే చెప్పాలి.

ఒక వేళ బీజేపీతో రహస్య సంబంధం పెట్టుకోవాలని బీఆర్ఎస్ భావించినా.. లేదా ప్రత్యక్షంగా స్నేహం చేయాలని తలచినా ముస్లిం ఓటర్లు దూరం కావడం తథ్యమనే వాదన వినిపిస్తోంది.అటు మజ్లిస్‌తో మంచి సంబంధాలు నెరుపుతున్నప్పటికీ బీజేపీతో సంబంధం పెట్టుకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గడ్డుపరిస్థితులే ఎదురవుతాయనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అందుకే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కేసీఆర్ బీజేపీతో పొత్తుతో వెళ్లేందుకు ఇష్టపడలేదు. తాత్కాలిక ఊరట కోసం రిస్క్ చేస్తే మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయం బీఆర్ఎస్ సీనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది.

OPINION BJP-BRS COMING TOGETHER LAST RAY OF HOPE

బీఆర్ఎస్‌కు వారసులు ఎవరు.?

2014లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. అదే ఊపును కొనసాగించి 2018లో మరోసారి అధికారం దక్కించుకున్నారు. అయితే రెండవ సారి సీఎంగా అయిన కేసీఆర్...చివరి రెండున్నరేళ్లలో తన కుమారుడు అప్పటి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను సీఎంగా ప్రమోట్ చేస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఇక 2019లో కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ ప్రకటించడంతో హరీష్‌రావు అలిగారనే వార్తలు గుప్పుమన్నాయి. కేసీఆర్ కుటుంబం అంతా కలిసే ఉన్నట్లు సంకేతాలు వచ్చినప్పటికీ వారి మధ్య తెలియని అసంతృప్తి ఉండేదని హరీష్ రావు సన్నిహితులు చెప్పుకొచ్చేవారు. హరీష్ రావు బీజేపీతో టచ్‌లోకి వెళ్లారనే వార్తలు కూడా ఈ మధ్యకాలంలో వినిపించాయి.

కేసీఆర్‌తో రాజకీయంగా సుదీర్ఘ ప్రయాణం చేసి పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన హరీష్ రావుకు మాస్‌లీడర్‌ ఇమేజ్ కూడా ఉంది. మరో వైపు కేటీఆర్‌ ప్రోగ్రెసివ్ లీడర్‌గా గుర్తింపు ఉంది.విజన్ కలిగిన నాయకుడిగా ప్రజల్లో మంచి పేరును సంపాదించారు.దీంతో ఒక వేళ కేసీఆర్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పాల్సి వస్తే కేటీఆర్ హరీష్ రావుల్లో ఎవరు పార్టీ పగ్గాలను చేపడతారనేది ప్రశ్నార్థకంగా మారింది.2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గమనిస్తే బీఆర్ఎస్ ఘోరంగా వైఫల్యం చెందింది. ఇందుకు కారణం వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి కేటీఆర్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటీఆర్‌ను కేవలం పట్టణ ప్రాంత ప్రజలు, చదువుకున్న వారు మాత్రమే సొంత చేసుకున్నారు. అందుకే హైదరాబాద్ నగరంలోనే బీఆర్ఎస్‌కు మెజార్టీ స్థానాలు వచ్చాయి.ఇక కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టుతో ఆ పార్టీని నడిపే పెద్ద దిక్కు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే అన్ని వేళ్లు హరీష్ రావు వైపే చూపిస్తున్నాయి.

OPINION BJP-BRS COMING TOGETHER LAST RAY OF HOPE

బీజేపీని నడిపించేదెవరు.?

తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతున్నప్పటికీ.. ఆ పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై క్లారిటీ లేదు. కాంగ్రెస్ విషయానికొస్తే కేసీఆర్ పై అంశాల వారీగా విరుచుకుపడుతూ ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ ప్రజల్లోకి దూసుకెళుతూ కేసీఆర్‌కు నిద్రపట్టకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హైకమాండ్ రేవంత్ వైపే మొగ్గు చూపి అతన్నే సీఎంగా ప్రకటించింది. 2020లో బీజేపీలో కనిపించిన జోష్ 2023 వరకు కొనసాగించడంలో విఫలమైంది. గత దశాబ్దకాలంగా మంచి సీఎం అభ్యర్థి కోసం బీజేపీ వేటాడుతోంది. కానీ ప్రయత్నాలు ఫలించడం లేదు.హరీష్‌రావుతో బీజేపీ జతకడితే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ‌గా పరిస్థితులు మారుతాయి. అంతేకాదు మాస్ లీడర్ ఇమేజ్ ఉన్న హరీష్ రావు నాయకత్వంలో బీజేపీ దూసుకెళుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అన్న విధానాన్ని తొలగించి ముందుకు వెళితే తెలంగాణలో బీజేపీకి చక్కటి అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

బీఆర్‌ఎస్ పడిపోయింది..కానీ..

ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది.అయితే ఈ పరిస్థితి ఎల్లకాలం ఉండదనేది గ్రహించాలి. ఇప్పుడప్పుడే తేరుకునే పరిస్థితి లేదని చెప్పడానికి వీలులేదు.రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీనే రెండవ అతిపెద్ద పార్టీగా ఉందన్న విషయాన్ని మరువకూడదు. ఇందుకు తాజా ఉదాహరణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కష్టమనే అంతా భావించారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా 135 స్థానాలను గెలుచుకున్నారు. మొత్తంగా కూటమికి 164 స్థానాలు వచ్చాయి. అంటే రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చనేదానికి ఇది చక్కటి ఉదాహరణ. బండ్లు ఓడలు కావొచ్చు.. ఓడలు బండ్లు కావొచ్చు. బీఆర్ఎస్ ఒక కుటుంబంగా నిలబడి, అధికార కాంగ్రెస్ పార్టీ చేసే తప్పిదాల కోసం వేచిచూసి సరైన సమయంలో సరిగ్గా పంజా విసిరితే తిరిగి అధికారాన్ని పొందొచ్చనేది పొలిటికల్ అనలిస్టుల మాట.

ఇక మొత్తంగా చూస్తే తెలంగాణ రాజకీయాలు భవిష్యత్తులో చాలా ఆసక్తికరంగా మారనున్నాయి.ఈ ప్రయాణంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. మరోవైపు బీజేపీ బలపడి రాష్ట్రంలో పాగా వేసే స్థాయికి ఎదుగుతుందా.. లేక కాంగ్రెస్ కట్టడి చేస్తుందా అనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+