అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం, గురి కుదిరేనా - ఆపరేషన్ అపోజీషన్..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్షాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. అంతు చిక్కని నిర్ణయాలతో హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాల కంటే ముందుగా 105 మంది అభ్యర్దుల ప్రకటనకు సిద్దమయ్యారు. అదే సమయంలో ప్రజాకర్షణ నిర్ణయాల ప్రకటన..అమలుతో ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడే వారిని నియంత్రించటంలో సక్సెస్ అవుతున్నారు.
సీఎం కేసీఆర్ దూకుడు : సీఎం కేసీఆర్ గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించటంతో పాటుగా ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిపక్షాల హామీలను పసి గట్టిన ముఖ్యమంత్రి వారి హామీలను తానే అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన నాలుగు వేల రూపాయాల పెన్షన్ ను తానే అమలు చేస్తానని ప్రకటించారు.

కేసీఆర్ హామీ ఇచ్చి అమలు చేయనివి తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రతిపక్షాలు భావించాయి. కానీ, రుణమాఫీతో సహా అన్నింటినీ అమలు చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యోగ నియమాలపైన కసరత్తు జరుగుతోంది. ఉద్యోగులకు పీఆర్సీతో పాటుగా ఐఆర్ ప్రకటనకు ముఖ్యమంత్రి సిద్దం అవుతున్నారు.
ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా : పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తరువాత ప్రభుత్వంపైన ఎంతో కొంత వ్యతిరేకత సహజం. కానీ, కేసీఆర్ పూర్తిగా పాజిటివ్ ఓటంగ్ నే తన అస్త్రంగా నమ్ముకుంటున్నారు. పదేళ్ల కాలంలో తాను తెలంగాణలో చేసిన నిర్ణయాలు..అమలు చేస్తున్న పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం..పూర్తయిన ప్రాజెక్టులు..మారిన హైదరాబాద్ రూపురేఖలు..రైతులకు దాదాపు 70 వేల కోట్లకు పైగా ఈ తొమ్మిదేళ్ల కాలంలో చేసిన రుణమాఫీపైన ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు.
అదే విధంగా 24 గంటల విద్యుత్, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు పైన ప్రజల్లో సానుకూలత ఉందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం లేకుండా ముఖ్యమంత్రి అన్నీ తానై ఎన్నికల నిర్ణయాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి : ఇక, ఊహించని విధంగా ప్రతిపక్షాల కంటే ముందుగానే సీఎం కేసీఆర్ ఏకంగా 105 మంది అభ్యర్దులను ప్రకటించేందుకు సిద్దమయ్యారు. దీని ద్వారా తన సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన నమ్మకం..తాను నమ్ముకున్న పాజిటివ్ ఓటింగ్ తో గెలుస్తామనే ధీమాను స్పష్టం చేస్తున్నారు. అభ్యర్దులను ఖరారు చేసి, ఇక సీఎం నుంచి అభ్యర్దులు అంతా ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో రెండు బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు.
ఇదే సమయంలో సీట్లు నిరాకరించిన వారికి భవిష్యత్ పై హామీ ఇస్తున్నారు. పది మంది సిట్టింగ్ లకు సీట్లు నిరాకరిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్న వారిని నియంత్రించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగేలా గేమ్ మొదలైంది.












Click it and Unblock the Notifications