కవిత నన్ను మెచ్చుకున్నారు: ఓటర్లకు బాబు హెచ్చరిక! ఏపీ సీఎంకు కాంగ్రెస్ కండువా కప్పిన గంగాభవానీ
హైదరాబాద్: నాడు హైదరాబాద్ నగరాన్ని కులీకుతుబ్‌షా నిర్మిస్తే ఈ నగరాన్ని ముందుకు తీసుకు వెళ్లింది తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఆయన హైదరాబాదులోని సనత్ నగర్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. చంద్రబాబుకు కాంగ్రెస్ నేత గంగాభవాని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు.
హైదరాబాద్ ఓ విజ్ఞాన కేంద్రం అన్నారు. తాను హైదరాబాదును కట్టానని చెప్పినట్లుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నానని, అలా తాను ఎప్పుడూ చెప్పలేదని, సైబరాబాద్‌ను నిర్మించానని చాలాసార్లు చెప్పానని, ఇప్పుడు మరోసారి స్పష్టం చేస్తున్నానని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్‌కు వస్తే పాతరోజులు గుర్తుకు వస్తున్నాయి
సైబరాబాద్ నిర్మాణం, శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, సాఫ్టువేర్ కంపెనీలను తీసుకు వచ్చానని చంద్రబాబు చెప్పారు. మెట్రో ప్రాజెక్టును తాను తీసుకు వస్తే, కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకు వెళ్తే దానిని కేసీఆర్ వల్ల ఆలస్యమైందని చెప్పారు. ప్రజాకూటమి విజయదుంధుబి మోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచానికి సేవలు అందించే సత్తా హైదరాబాద్‌కు ఉందని చెప్పారు. హైదరాబాద్ వస్తే పాతరోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు.

ఇప్పుడు కలిసింది స్వార్థం కోసంకాదు
కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ముప్పై సంవత్సరాలు హోరాహోరీగా పోరాడాయని, కానీ ఇప్పుడు కలిశామంటే తన స్వార్థం కోసం కాదని, అలాగే రాహుల్ గాంధీ స్వార్థం కోసం కాదని చంద్రబాబు చెప్పారు. దేశం కోసం కలిశామన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణనుకేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. తెరాస గురించి తాను ఎప్పుడు చెడుగా మాట్లాడలేదని, కానీ కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ట్రిపుల్ తలాక్‌ను అడ్డుగా పెట్టుకొని మైనార్టీలను వేధించాలని బీజేపీ ప్రయత్నించిందని, దానిని కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేకించిందన్నారు.

నరేంద్ర మోడీలా కేసీఆర్ బెదిరింపులు
ఢిల్లీలో నరేంద్ర మోడీ బెదిరిస్తుంటే, తెలంగాణలో కేసీఆర్ బెదిరింపులు ప్రారంభించారని చంద్రబాబు విమర్శించారు. తెలంగాణ రావడంలో తన పాత్ర ఉందని తెరాస నేతలు చెప్పారని, హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్ర ఉందని కూడా చెప్పారని, ఇప్పుడు ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. మోడీతో లాలూచీపడ్డారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అభ్యర్థి సీఎం అయితే, కోదండరాం నేతృత్వంలో టీడీపీ తెలంగాణను ముందుకు తీసుకు వెళ్తుందన్నారు.

తెరాస వ్యతిరేక పవనాలు
హుసేన్ సాగర్ ప్రక్షాళనకు, డబుల్ బెడ్రూం వంటి వాటికి తాను అడ్డుపడ్డానా అని చంద్రబాబు తెరాసను నిలదీశారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసిందని, దీనిని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. తానుహైదరాబాదును ప్రపంచపటంలో పెట్టానని చెబితే ఎగతాళి చేశారన్నారు. ప్రజాకూటమిని గెలిపించి, తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలన్నారు. వారం రోజులు ప్రతి ఒక్కరు సైనికుడిలా పని చేయాలన్నారు. ఇది మీ భవిష్యత్తు కోసం, తెలుగువాళ్ల భవిష్యత్తు కోసమన్నారు. తెరాస వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. లేనిపోని మాటలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పారు.

ఎన్నికల సమయంలో.. చంద్రబాబు హెచ్చరిక
ఎన్నికల సమయంలో మానిప్యులేట్ చేస్తారని చంద్రబాబు ఓటర్లను, కార్యకర్తలను హెచ్చరించారు. ఈవీఎంలో ఎవరికి ఓటు వేశామో వారికి పడిందా చూడాలని సూచించారు. మీరు ఓటు వేసిన వారికి పడకుంటే మేం కూడా మీకు అండగా ఉంటామన్నారు. మోడీ సహకారంతో తెలంగాణ ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. గంటల వ్యవధిలో తెలంగాణ అసెంబ్లీని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఎక్కడా అవకతవకలు జరగకుంటే మహాకూటమి అద్భుతంగా గెలుస్తుందని చెప్పారు. హైదరాబాదులో డైమండ్ వంటి పిల్లలు ఉన్నారని, ఏదైనా చేసే శక్తి కలిగిన వారు ఉన్నారని, మంచి ప్రజానీకం ఉన్నారని చెప్పారు.
కవిత, కేటీఆర్ నన్ను మెచ్చుకున్నారు
తెలంగాణలో సంపద తన వల్లే పెరిగిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారని చంద్రబాబు అన్నారు. సైబరాబాద్ తన వల్లే వచ్చిందని కేటీఆర్ చెప్పారని అన్నారు. అలాంటి వారు ఇప్పుడు తనను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. గోదావరిలో 2500 నీరు సముద్రానికి పోతున్నాయని, ఆ నీరు ఉపయోగించుకుంటే నీటి సమస్య తీరుతుందని చెప్పారు. ప్రసంగం చివరలో ప్రజాకూటమి ఐక్యత వర్ధిల్లాలి అని సభికులతో నినాదాలు చేశారు. జై తెలంగాణ అని కూడా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications