
కొండగట్టులో ముగిసిన పవన్ కళ్యాణ్ వారాహి పూజలు: గజమాలలు.. పూలతో జనసేనానికి బ్రహ్మరథం!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టు లోని ఆంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. కొండగట్టులో పవన్ కళ్యాణ్ తన ప్రచార రథమైన వారాహికి ప్రత్యేక పూజలు చేయించారు. దీంతో వారాహి ఎన్నికల సమరానికి సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో భారీగా అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తలు కొండగట్టులో హంగామా చేశారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన ఇప్పటివరకు ఎలా సాగింది అంటే..
కొండగట్టుకు పవన్ కళ్యాణ్; వారాహికి పూజల వేళ.. తెలంగాణాలో జనసేన జోష్!!

కొండగట్టులో పవన్ కోసం అభిమానుల రద్దీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టుకు నేడు విపరీతమైన రద్దీ కనిపించింది. పవన్ ఫ్యాన్స్ తమ అభిమాన నేత కోసం ఈరోజు తెల్లవారుజామునుంచే కొండగట్టులో మకాం వేశారు. జనసేన అధినేత పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టులోనే కాకుండా ధర్మపురిలో నారసింహ యాత్రను ప్రారంభించనున్న నేపధ్యంలో అక్కడ కూడా ముమ్మరంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

గజమాలతో సత్కరించి పూలు చల్లుతూ కొండగట్టుకు స్వాగతం
హైదరాబాద్ నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి బయలుదేరిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు మధ్యలో హకీంపేటలో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. రోడ్డుపై లారీ రిపేర్ కావడంతో హకీంపేట వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఇక పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసి పవన్ కళ్యాణ్ ను అక్కడి నుండి పంపించారు. ఆపై మార్గమధ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ గజమాలతో క్రేన్ సాయంతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు . పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపిస్తూ కొండగట్టుకు స్వాగతించారు. అడుగడుగునా నీరాజనాలతో పవన్ కు ఫ్యాన్స్ స్వాగతం పలికారు.

ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు.. వారాహికి పూజలు
ఇక కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం తెలిపారు. ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఇక వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజాధికాలు నిర్వహించిన పవన్ కళ్యాణ్, కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలను పూర్తి చేశారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణా ప్రాంత జనసేన నేతలతో పవన్ సమావేశం
పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. కొండగట్టులో వారాహి వాహనానికి పూజల అనంతరం పవన్ కళ్యాణ్ నాచుపల్లి సమీపంలోని కొడిమ్యాల మండల పరిధిలోని బృందావన్ రిసార్ట్ లో తెలంగాణ ప్రాంత జనసేన నేతలతో సమావేశం కానున్నారు. ఇక నేటి పూజల తరువాత నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోనుంది.