వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్ట మధు ఎక్కడ.. 7 రోజులుగా మిస్సింగ్.. మంత్రికి ఆయన సతీమణి ఫిర్యాదు.. అసలేం జరుగుతోంది?

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సన్నిహితుడైన పుట్ట మధు ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన రోజే అజ్ఞాతంలోకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఏడు రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్న మధు ఆచూకీపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇప్పటికీ ఆయన ఫోన్ స్విచ్చాఫ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. పుట్ట మధు మిస్సింగ్‌పై ఆయన భార్య పుట్ట శైలజ ఏకంగా మంత్రులను కలిసి ఫిర్యాదు చేయడంతో అసలేం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. భార్య శైలజకు కూడా సమాచారం ఇవ్వకుండా పుట్ట మధు ఎక్కడికి వెళ్లి ఉంటారన్నది అంతుచిక్కడం లేదు.

మంత్రిని కలిసిన పుట్ట శైలజ...

మంత్రిని కలిసిన పుట్ట శైలజ...

పుట్ట మధు మిస్సింగ్‌పై ఆయన సతీమణి శైలజ గురువారం(మే 6) సాంఘీక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కుమారుడు,కోడలిని వెంటపెట్టుకుని ఆమె మంత్రి వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్యం కారణంగా మంత్రి కొప్పుల వారిని కలవకపోవడంతో అక్కడినుంచి వెనుదిరగినట్లు సమాచారం. ఆ తర్వాత మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పుట్ట శైలజ కలిసినట్లు ప్రచారం సాగుతోంది. ఐదు రోజులుగా తన భర్త ఆచూకీ తెలియట్లేదని... దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని శైలజ మంత్రిని కోరినట్లు కథనాలు వస్తున్నాయి.

గన్‌మెన్లు వెంటే ఉన్నారా..?

గన్‌మెన్లు వెంటే ఉన్నారా..?

ఏడు రోజుల క్రితం మంథని నుంచి హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన పుట్ట మధు.. ప్రభుత్వం కేటాయించిన వాహనంలో కాకుండా తన సతీమణి శైలజ కారులో వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయినట్లు తెలుస్తోంది. పుట్ట మధు గన్‌మెన్ల విషయంలోనూ గందరగోళం నెలకొంది. రామగుండం కమిషరేట్‌ సీపీ సత్యనారాయణ.. ఇప్పటికీ గన్‌మెన్లు పుట్ట మధుతోనే ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ గన్‌మెన్లు పుట్ట మధుతోనే ఉంటే ఏడు రోజులుగా ఆయన ఆచూకీపై సస్పెన్స్ ఎందుకు నెలకొంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఆ ఫోన్ కాల్ తర్వాతే మిస్సింగ్?

ఆ ఫోన్ కాల్ తర్వాతే మిస్సింగ్?

పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై వారం రోజుల క్రితం రాష్ట్ర పోలీస్ శాఖలోని ఉన్నతాధికారి నుంచి పుట్ట మధుకు ఫోన్ కాల్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాతే ఆయన మంథని పట్టణాన్ని వీడి అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం ఉంది. ఆ ఫోన్ చేసి అధికారి ఏం మాట్లాడారు... పుట్ట మధు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందన్నది చర్చనీయాంశంగా మారింది.

బంధువుల ఇళ్లల్లో ఉన్నారా...

బంధువుల ఇళ్లల్లో ఉన్నారా...

పుట్ట మధు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అక్కడ తన బంధువుల ఇళ్లల్లో ఆయన ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. చివరిసారిగా ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా మహారాష్ట్రలోనే ట్రాక్ అయినట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని వాంకిడి చెక్ పోస్టు వద్ద పుట్ట మధు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పుట్ట మధుపై ఓ ప్రముఖ పత్రిక కథనంతో ఈ విషయాలన్నీ వెలుగుచూశాయి. దీంతో పుట్ట మధు వ్యవహారంలో అసలేం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కట్లేదు.

పుట్ట మధుపై ఆరోపణలు...

పుట్ట మధుపై ఆరోపణలు...

పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ ప్రగతి భవన్‌ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలిసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రయత్నం సఫలం కాకపోవడంతో ఆమె మంత్రులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పుట్ట మధు మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వామన్ రావు దంపతుల హత్య కేసు,ఈటల రాజేందర్ వ్యవహారాల్లో తన ప్రమేయం లేదని మంత్రుల ద్వారా సీఎంతో చెప్పించేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పుట్ట మధుపై కూడా భూకబ్జా ఆరోపణలు,అక్రమ ఆస్తుల ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈటలపై ప్రభుత్వం వేటు వేయడంతో... ఇదే క్రమంలో పుట్ట మధుపై కూడా చర్యలకు దిగుతోందా అన్న ఊహాగానాలకు ఈ పరిణామాలు ఊతమిస్తున్నాయి.

కుట్ర అంటున్న అనుచరులు

కుట్ర అంటున్న అనుచరులు

పుట్ట మధు అనుచరులు మాత్రం ఇదంతా తమ నాయకుడిపై జరుగుతోన్న కుట్ర అని మండిపడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని... ఉద్దేశపూర్వకంగానే ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే విషయంపై గురువారం(మే 6) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశమై మీడియా సమావేశం నిర్వహించారు. మరో రెండు రోజుల్లో పుట్ట మధు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెప్పారు.మొత్తం మీద పుట్ట మధు వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

English summary
Missing of Peddapalli ZP chairman and former MLA Putta Madhu has become a hot topic in state politics. Putta Madhu, who is close to former minister Etala Rajender, went into anonymity on the day of the land grab allegations against Etala. The suspense over the whereabouts of Madhu, who has been missing for the past seven days, is not over yet. It looks like his phone is still in the switch off mode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X