రారైస్ కొంటామన్నా కేసీఆర్ సర్కారు సహకరించట్లేదు: కేంద్రమంత్రి గోయల్, బండి సంజయ్ ఫైర్
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, బండి సంజయ్ కలిశారు. కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఎంపీలు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

యాసంగి ధాన్యం కొంటామన్న కేంద్రంపై కేసీఆర్ దుష్ప్రచారం
కేంద్రం యాసంగి ధాన్యం కొనట్లేదని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పీయూష్ గోయల్ తెలంగాణ సర్కారు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా ధాన్యం సేకరిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయమని పీయూష్ గోయల్ ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా గతంలోనే ఈ విషయంపై సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. యాసంగి సీజన్లోనూ తెలంగాణ నుంచి రారైస్ కొంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వమే సహకరించడం లేదన్నారు. గతంలో సేకరించి ఇస్తానన్న బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసిందన్నారు.

తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయకపోవడంతో రైతులకు నష్టం
పసుపు రైతులకు పరిహారంపై ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్రమంత్రితో చర్చించారు. పరిహారంపై ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని కేంద్రమంత్రి తెలిపినట్లు తెలిసింది.
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సైతం ఫసల్ బీమా అమలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపితే... కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.

కేంద్రాన్ని బద్నాం చేసేందుకే కేసీఆర్ దుష్ప్రచారం: బండి సంజయ్
కేంద్రమంత్రితో భేటీ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసం కేసీఆర్ ప్రభుత్వం బీజేపీని బద్నాం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. గతంలోనూ ఇదే అంశంపై కేంద్రాన్ని బద్నాం చేసేందుకు పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు, ఢిల్లీకి వచ్చి రాష్ట్ర మంత్రుల బృందం రకరకాల డ్రామాలాడి భంగపడ్డ విషయాన్ని ఈ సందర్భంగా సంజయ్ గుర్తు చేశారు. మళ్లీ యాసంగి పేరుతో టీఆర్ఎస్ కొత్త డ్రామాలకు తెరదీసిందని విమర్శించారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications