బీఆర్ఎస్ లోకి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి; హరీష్‌రావు భేటీతో కాంగ్రెస్ కు షాక్!!
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని మంత్రి హరీష్ రావు బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన రెండవ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే నేడు విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్ళిన హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని విష్ణువర్ధన్ రెడ్డిని కోరారు.
విష్ణువర్ధన్ రెడ్డితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డికి అన్యాయం చేసిందని పేర్కొన్నారు. జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండరని, కార్మిక పక్షపాతిగా ఆయన చేసిన ప్రజాసేవ అందరికీ తెలుసని తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అలాంటి నేత వారసుడికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ముఠా కోరుల చేతుల్లోకి వెళ్లిందని వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలోకి విష్ణువర్ధన్ రెడ్డిని ఆహ్వానించామని, బీఆర్ఎస్ లో చేరడానికి విష్ణు వర్ధన్ రెడ్డి కూడా అంగీకారం తెలిపారని, త్వరలోనే గులాబీ కండువా కప్పుకుంటారు అని పేర్కొన్నారు.
తెలంగాణా రాష్ట్ర సాధనా ఉద్యమంలో విష్ణు వర్ధన్ రెడ్డి ఎంతో బాగా పనిచేశారని గుర్తు చేసిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన తరువాత విష్ణు వర్ధన్ రెడ్డి అధికారికంగా పార్టీలో చేరతారని పేర్కొన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటేనే పీజేఆర్ పీజేఆర్ అంటేనే కాంగ్రెస్ అనేట్టు ఉండేదని పేర్కొన్న మంత్రి హరీష్ రావు సీఎల్పీ నేతగా పిజెఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు.
అలాంటి పిజెఆర్ వారసుడికి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో విష్ణుకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో విష్ణు వర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ బాట పడితే కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ లో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications