సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు స్వాగతోత్సవాలు: మోదీ రాక
హైదరాబాద్: తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టింది. వచ్చే సెప్టెంబర్- అక్టోబర్‌ల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చు. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపుగా ఖాయమైనట్టే. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు చేస్తోన్నాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- హైదరాబాద్ కు రానున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్నింటిని ప్రారంభించనున్నారు.
తన పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఇది. నిజానికి జనవరిలోనే మోదీ హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉన్నప్పటికీ.. అప్పట్లో వాయిదా పడిన విషయం తెలిసిందే. పర్యటన రద్దయినప్పటికీ సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ రైలును ఢిల్లీ నుంచే వర్చువల్ గా ప్రారంభించారు. అప్పటి పర్యటన.. ఇప్పుడు తాజాగా షెడ్యూల్ అయింది.

తెలంగాణ- ఏపీ మధ్య పట్టాలెక్కనున్న రెండో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య పరుగులు తీయనుంది. ప్రారంభోత్సవం రోజున ఉదయం 11:30 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మిగిలిన రోజుల్లో తెల్లవారు జామున 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. నల్గొండ-7:19, గుంటూరు-9:45, ఒంగోలు- 11:09, నెల్లూరు-12:29, తిరుపతికి మధ్యాహ్నం 2:30 నిమిషాలకు చేరుకుంటుంది.
అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో 3:15 నిమిషాలకు బయలుదేరుతుంది. నెల్లూరు- 5:20, ఒంగోలు- 6: 30, గుంటూరు- 7:45, నల్గొండ- 10:10, సికింద్రాబాద్ కు రాత్రి 11.45 నిమిషాలకు చేరుకుంటుంది. తొలి రోజున మాత్రం నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఆయా స్టేషన్లల్లో స్థానికులు వందే భారత్ రైలుకు ఘన స్వాగతం పలికేలా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు కార్యక్రమాలను రూపొందించుకున్నారు. పికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్లే సర్వీస్ కు 20701, తిరుపతి నుంచి సికింద్రాబాద్ తిరుగుముఖం పట్టే సర్వీస్ కు 20702 నంబర్లను ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications