మోడీ ప్రకటనతో 12 ఏళ్ల తర్వాత చెప్పులు వేసుకున్న రైతు ఈయనే
నిజామాబాద్: పసుపు బోర్డ్ ఏర్పాటు అనేది తెలంగాణ రైతుల దశాబ్దాల కల. దాని కోసం అనేక మంది రైతులు పోరాటాన్ని కొనసాగించారు. ఒక రైతు మాత్రం పసుపు బోర్డ్ ఏర్పాటు చేసే వరకూ తాను చెప్పులు వేసుకుకోనని శపథం చేశాడు. దశాబ్దానికిపైగా ఆయన చెప్పులు లేకుండానే నడిచారు. తాజాగా, రెండ్రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దాదాపు 12 ఏళ్లపాటు చెప్పులు లేకుండానే నడిచిన పసుపు రైతు మనోహర్ శంకర్ రెడ్డి తన దీక్షను విరమించారు. 12 ఏళ్ల తర్వాత ఆయన చెప్పులు వేసుకున్నారు. అయితే, ఒక్పపుడు రైతుగా పంట పండించాలనుకున్న మనోహర్ రెడ్డికి.. ఇప్పుడు పంట భూమి లేకపోవడం గమనార్హం. వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తన భూమి మొత్తాన్ని అమ్మేశాడు రైతు మనోహర్ రెడ్డి.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో నివాసముంటున్న మనోహర్ శంకర్ పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గతంలోనే డిమాండ్ చేశారు. స్వయంగా పసుపును కూడా సాగు చేసిన ఆయన.. పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు బూట్లు, చెప్పులు వేసుకోనని 2011, నవంబర్ 4న ప్రతిజ్ఞ చేశారు.
అంతేగాక, బోర్డ్ మెంబర్ కావాలనే కోరికతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరరుని పాదాల వరకు 63 రోజులపాటు పాదయాత్ర కూడా చేశారు. మనోహర్ శంకర్ రెడ్డి టీవీలో పసుపు బోర్డ్ ఏర్పాటు ప్రకటన విన్న వెంటనే ఇదంతా దేవుడి దయ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ప్రకటన రావడంతో శంకర్ రెడ్డికి రైతులు కొత్త చెప్పులు బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆ చెప్పులను ఆనందంతో వేసుకున్నారు మనోహర్ రెడ్డి. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications