జూలై 12న రాష్ట్రానికి ప్రధాని - మూడో వందేభారత్ ప్రారంభం, రూట్ ఖరారు..!!
ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. జూలై 12న ప్రధాని పర్యటనకు కసరత్తు జరుగుతోంది. వరంగల్ లో పార్టీ సభలో పాల్గొనేలా షెడ్యూల్ సిద్దం చేస్తున్నారు. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మూడో వందేభారత్ ను ప్రధాని ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య ప్రధాని ఈ నాలుగో వందేభారత్ ను ప్రారంభించనున్నారు.
వరంగల్ సభలో ప్రధాని
ప్రధాని మోదీ ముందుగా భావించిన ప్రకారం ఈ నెలాఖరులోగా రాష్ట్రానికి రావాల్సి ఉంది. బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేసారు. కానీ, కార్యక్రమం వాయిదా పడింది. హోం మంత్రి అమిత్ షా ఖమ్మంలో జరగాల్సిన సభ బిపర్జాయ్ తుఫాను కారణంగా రద్దు అయింది.
బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా నాగర్ కర్నూల్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. తెలంగాణాలో త్వరలో జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్..బీఆర్ఎస్ దూకుడు పెంచటంతో బీజేపీ పొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. భోపాల్ సభలో కేసీఆర్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ తెలంగాణలోనూ పర్యటనకు సిద్దం అయ్యారు. అందులో భాగంగా వరంగల్ పర్యటన...పార్టీ సభకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

మూడో వందేభారత్ ప్రారంభం
హైదరాబాద్ వేదికగా జూలై 8న ఏకంగా 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు..సంస్థాగత కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. శాసనసభ ఎన్నికలకు పార్టీని సంసిద్దం చేసే క్రమంలో భాగంగా ఈ కీలక సమావేశానికి హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల నుంచి 600 మంది బీజేపీ కార్యకర్తలు తెలంగాణకు ఈ వస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం దిశగా పని చేస్తారు.
ప్రధాని పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ - నాగపూర్ వందేభారత్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి ట్రయిల్ రన్ పూర్తి చేసారు. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ - విశాఖ పట్టణం, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. కాగా , ఇది మూడోది కానుంది.

ఆరున్నార గంటల్లోనే చేరుకొనేలా
సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య 581 కిమీ దూరం ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణానికి 10 గంటల సమయం పడుతోంది. ఇప్పుడు కొత్తగా వందేభారత్ ద్వారా ప్రయాణ సమయం 10 గంటల నుంచి 6.30 గంటలకు తగ్గనుంది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, రామగుండం, సిర్పూర్ ఖాగజ్ నగర్, బలార్షా మీదుగా ఈ రైలును నడపేలా రూట్ సిద్దం చేసారు.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ నాగపూర్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్నాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్నాహ్నం 1.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8 గంటలకు నాగపూర్ చేరుకొనేలా షెడ్యూల్ ఖరారు చేసారు. ఇప్పుడు ప్రధాని పర్యటనలో ఈ రైలు ప్రారంభించేలా కసరత్తు చేస్తుండటంతో..అధికారిక ప్రకటనకు రైల్వే అధికారులు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications