మళ్ళీ నవంబర్ 11న తెలంగాణాకు ప్రధాని మోడీ.. ఈసారి ఆ ప్రకటనకు ఛాన్స్!!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ జాతీయ నాయకుల పర్యటనలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్నారు. ఈనెల 7వ తేదీన ఆయన హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభకు హాజరై ప్రసంగించి, బిజెపి బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తుందని ప్రకటించారు.
ఇక తాజాగా మరో మారు ఈనెల 11వ తేదీన పర్యటించనున్న మోడీ ఈసారి మాదిగ విశ్వరూప సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 11వ తేదీన సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు నరేంద్ర మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు రోడ్డు మార్గంలో పెరేడ్ గ్రౌండ్ మైదానానికి వెళతారు.

అక్కడ ఐదు గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు పెరేడ్ గ్రౌండ్ మైదానంలో మాదిగా విశ్వరూప బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. తిరిగి 5.55 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, తిరిగి 6 గంటలకు బేగంపేట నుంచి మోడీ ఢిల్లీకి వెళ్లిపోతారు.
పెరేడ్ గ్రౌండ్ మైదానంలో నిర్వహించే మాదిగ విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు. మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ పై ఎంతో కాలంగా మాదిగలు ఎదురు చూస్తున్న నేపధ్యంలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఈ క్రమంలో ప్రధాని మోడీ పర్యటనపై, తెలంగాణ రాష్ట్రంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించడం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తెలంగాణా ఎన్నికల సమయంలో మాదిగల వర్గీకరణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేస్తే దాని ప్రభావం ఈ ఎన్నికలపై ఏ మాత్రం ఉంటుందో మరి తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications