మోదీ సంచలనం- 15వ తేదీ నాడే సికింద్రాబాద్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..!!
హైదరాబాద్: తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టింది. వచ్చే సెప్టెంబర్- అక్టోబర్‌ల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చు. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపుగా ఖాయమైనట్టే. తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో అయిదు, ద్వితీయార్థంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు షెడ్యూల్ కానున్నాయి.

ఎన్నికల వేడి..
అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు చేస్తోన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్- భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత ఎదుర్కొనబోతోన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటడానికి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడానికి ఈ అసెంబ్లీ ఎన్నికలను తొలి మెట్టుగా భావిస్తోన్నారు కేసీఆర్.

ప్రధాని మోదీ రాక..
ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- తలపెట్టిన హైదరాబాద్ పర్యటన అనూహ్యంగా రద్దయినట్టే కనిపిస్తోంది. ఈ నెల 19వ తేదీన ఆయన హైదరాబాద్ లో పర్యటించాల్సి ఉంది. కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయడంతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించల్సి ఉంది. తన పర్యటన సందర్భంగా ఆయన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సైతం జెండా ఊపి ప్రారంభించాల్సి ఉండగా.. అది వాయిదా పడింది.

ప్రీ పోన్..
పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వచ్చిన ఈ షెడ్యూల్.. ఇప్పుడు ప్రీ- పోన్ అయింది. ఇంకో నాలుగు రోజులు ముందుకు జరిగింది. 15వ తేదీ నాడే- అంటే సంక్రాంతి పండగ నాడే ప్రధాని మోదీ సికింద్రాబాద్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు.. వర్చువల్‌గా. దేశ రాజధాని నుంచి ఆయన వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచే జెండా ఊపి- వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ను పట్టాలెక్కిస్తారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకూ..
అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా ఈ విధానంలోనే ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఏపీకి చేరుకుంది. విశాఖపట్నానికి వచ్చింది. అక్కడ రాళ్లతో స్వాగతం పలికారా ఎక్స్‌ప్రెస్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. కంచరపాలం వద్ద దుండగులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు బోగీల అద్దాలు పగిలాయి.












Click it and Unblock the Notifications