మోడీ వినాయక చవితి కానుక: తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రయాణించే వందేభారత్ రైళ్ల సంఖ్య మరింత పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో గుడ్‌న్యూస్ చెప్పింది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ కానుక అందించారు. సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
నాగ్‌పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్లు అనుసంధానత కలిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.

మరోవైపు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వయో వృద్ధుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆపన్నహస్తం అందించారని కిషన్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్లు దాటిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించారన్నారు. పేద, ధనిక తేడా లేకుండా 6 కోట్ల మంది వయోవృద్ధులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఈ పథకంపై రూ. 3,437 కోట్లను కేంద్రం ఖర్చ చేయనుందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి జరగనుందని కిషన్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులందరికీ ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిందని తెలిపారు. ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న కుటుంబాల్లో 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ. 5 లక్షల టాప్-అప్ కవర్ ఇవ్వనుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వయోవృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వయో వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications