వేరు వేరు ఘటనల్లో ఇద్దరు ఎస్సైలు మృతి.. కారణం ఏంటి?
రాష్ట్రంలోని రెండు వేరు వేరు ఘటనల్లో పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఇద్దరు ఎస్సైలు మృతిచెందారు. మంచిర్యాలలో గుండెపోటుతో ఎస్సై రాథోడ్ తానాజీ మృతి చెందారు. మరోవైపు జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఎస్సై శ్వేత దుర్మరణం చెందారు. దీంతో పోలీస్ డిపార్ట్ మెంట్ లో విషాదఛాయలు అలముకున్నాయి.
గుండెపోటుతో కుప్పకూలి..
మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) ఇవాళ తెల్లవారుజామున పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. తానాజీ స్వస్థలం ఉట్నూర్ మండలం, ఎందా గ్రామం. తానాజీ ఆకస్మిక మరణంతో డిపార్ట్ మెంట్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం సహోద్యోగుల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది.

రోడ్డు ప్రమాదంలో..
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారు, ద్విచక్ర వాహనం పరస్పరం ఢీకున్నాయి. దీంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల ఎస్సై శ్వేత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఆమె జగిత్యాల హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆమె గతంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేశారు.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడు కూడా మృతి చెందాడు. ఆమె అకాల మరణం పోలీస్ శాఖను శోకసంద్రంలో ముంచింది. ఈ రెండు ఘటనలు పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపాయి. మరణించిన అధికారుల కుటుంబాలకు పోలీస్ శాఖ సంతాపం తెలిపింది.












Click it and Unblock the Notifications