బిగ్ బాస్‌కు పీకల్దాకా తెచ్చిన పల్లవి ప్రశాంత్ వ్యవహారం
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ వ్యవహారం మరింత ముదిరింది. రోజురోజుకూ ఇబ్బందికర పరిణామాలకు దారి తీస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ ఫినాలె ముగిసిన తరువాత సంభవించిన దాడులు, ప్రతిదాడులు బిగ్ బాస్‌కు పీకల మీదికి తీసుకొచ్చాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్‌ను పల్లవి ప్రశాంత్ గెలిచిన విషయం తెలిసిందే. అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. గ్రాండ్ ఫినాలె ముగిసిన అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్‌దీప్ కారుపై దాడలు చేశారు. చేతికి అందిన వస్తువులను కారు మీదికి విసిరేశారు. అద్దాలు పగలగొట్టారు. కారు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు.

ఆ సమయంలో అమర్‌దీప్, ఆయన తల్లి, భార్య కారులోనే ఉన్నారు. ఈ ఘటనతో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులను చెదరగొట్టారు.
ఈ గొడవ అక్కడితో ఆగలేదు. నడిరోడ్డు మీదికి వచ్చింది. కృష్ణానగర్- అన్నపూర్ణ స్టూడియోస్ బస్‌స్టాప్ వద్దా కొట్టుకున్నారు. ఘర్షణకు దిగారు. ఆ మార్గంలో వెళ్లోన్న సిటీ బస్సులపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఆరు సిటీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, రాణిగంజ్.. ఇతర డిపోలకు చెందిన బస్సులు అవి.

ఈ దాడుల నేపథ్యంలో- పల్లవి ప్రశాంత్ సహా మరికొందరు ఆయన అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు చంచల్ గూడ జైలులో గడిపారాయన. అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో విడుదల అయ్యారు.
తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గ్రాండ్ ఫినాలే అనంతరం చోటు చేసుకున్న దాడులకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. బిగ్ బాస్ నిర్వాహక సంస్థ ఎండమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈ నోటీసులను పంపించారు. దాడుల వ్యవహారంపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications