పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు.. కేసీఆర్ ట్రైనింగ్ అంటూ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, తాను కరీంనగర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందన్న పాడి కౌశిక్ రెడ్డి.. జనవరి 17న హాజరవుతానని జవాబిచ్చారు.
బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు మేరకు గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాసబ్ ట్యాంక్ ఇన్ స్పెక్టర్ పరశురామ్‌ను దర్యాప్తు అధికారికగా డీసీపీ విజయ్ కుమార్ నియమించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కౌశిక్ రెడ్డికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.

కాగా, తన అరెస్టు, కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాజాగా బుధవారం కూడా తనకు మళ్ళీ పోలీసులు నోటీసులు ఇచ్చారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
తనపై అన్యాయంగా కేసులు పెడితే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రశ్నిస్తామని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ శిక్షణ ఇచ్చిన బిడ్డను ఏ మాత్రం భయపడను అని చెప్పుకొచ్చారు. తాను తప్పు చేసినట్లు రుజువైతే ఉరి తీయండని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే.. జనవరి 16 హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆరోజు కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో రైతు భరోసా, రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే సంజయ్ దాడి చేశారని ఆరోపించారన్నారు. ఆరోజు మంత్రి శ్రీధర్ బాబు
కూడా వేలు ఎత్తి చూపుతూ బెదిరించారంటూ వీడియోను ప్రదర్శించారు.
బీఆర్ఎస్ బీఫారంపై గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ ను ప్రశ్నిస్తే.. తనపై కేసులు పెడతారా? అంటూ పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. తనపై చీటింగ్, హత్య కేసులు లేవని.. అదే రేవంత్ రెడ్డిపై 82కుపైగా కేసులు ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డిపై మొదటి కేసే చీటింగ్ కేసు అని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications