పొగ ప్లస్ మంచుముసుగు: మేల్కొకుంటే మనకూ తప్పని ‘హస్తిన’ పాట్లు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: భాగ్య నగరంపై ఆవరించుకున్న పొగ.. దానిపై పొగ మంచు కలగలిసి హైదరాబాదీని చలి వణికిస్తున్నది. కాలుష్యం కమ్మేస్తున్నది. అటు సాధారణానికంటే తగ్గిన గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడు శీతల గాలులు ఉధృతం అయ్యాయి. మరోవైపు కమ్ముకుంటున్న మేఘాలు తదితర అంశాలతో ఎక్కడికక్కడే కాలుష్యం ఆవరిస్తుండటంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌ నగర పరిధిలో నెలకొన్న విభిన్నమైన వాతావరణ పరిస్థితి ఇది.

చలికాలం కావడం, మేఘాలు ఆవరిస్తుండటంతో.. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న పొగ వాతావరణంలో కలసిపోకుండా ఎక్కడిక్కడే కమ్ముకుంటోంది. దీనికి దుమ్మూ ధూళి కూడా తోడవుతోంది. సూక్ష్మ దూళి కణాలు 'ఘనపు మీటర్ గాలిలో' 60 మైక్రోగ్రాములకు 106 మెక్రోగ్రాములు ఉన్నది. రెండు మెక్రోగ్రాములు ఉండాల్సిన కార్బన్ డయాక్సైడ్.. 12 మైక్రోగ్రాములు ఉండటం గమనార్హం. స్థూల దూళి కణాలు 'ఘనపు గాలిలో' మీటర్‌కు 60 మైక్రోగ్రాములకు 110 మైక్రోగ్రాములు ఉన్నాయి. 

ఇక సల్ఫర్ డయాక్సైడ్ 50కి మైక్రోగ్రాములు, 40 మైక్రోగ్రాముల నత్రజనికి 44 మెక్రోగ్రాములు నిల్వలు ఉండటంతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తీవ్రంగా ఇబ్బందుల పాలవుతున్నారు. అసలు హైదరాబాద్‌ నగరంలో కాలుష్యాన్ని తగ్గించే అంశంపై కాలుష్య నియంత్రణ మండలిగానీ, ప్రభుత్వం గానీ దృష్టి సారించకపోవడంతో ఏటేటా పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది.

అటు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న వారికి జైలుశిక్ష, జరిమానాలు విధించాలన్న నిర్ణయం కూడా కాగితాలకే పరిమితమవుతోంది. 'క్లీన్ ఎయిర్ అథారిటీ' ఏర్పాటు చేసే విషయమై అధికార యంత్రాంగం మౌనంగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తాయని, ఇప్పటికైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 భవిష్యత్ పరిణామాలకు సంకేతమా?

భవిష్యత్ పరిణామాలకు సంకేతమా?

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈ సీజన్‌లో సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల మేర నమోదవుతాయి. కానీ మంగళవారం గరిష్టంగా 28.5 డిగ్రీలు, కనిష్టంగా 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో ఆకాశంలో మేఘాలు ఆవరించి ఉన్నాయి. తేమతో కూడిన శీతల గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. గాలిలో తేమ 48 శాతంగా నమోదైంది. దీంతో వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, సూక్ష్మ, స్థూల ధూళి కణాలు. వాతావరణంలో కలసిపోకుండా గాలిలోనే ఆవరించి ఉంటున్నాయి. దీంతో సరిగా శ్వాస తీసుకోలేని ఇబ్బందికర పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇటీవల దేశ రాజధాని ‘హస్తిన'లో పొగ మంచుకు తోడు పొరుగు రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వరి పొలాల నుంచి గడ్డి దుబ్బు తగులబెట్టడంతో గాలిలో కలిసిన పొగ.. శీతల మంచుపొగతో కలిసి విషపూరితంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టు మొదలు జాతీయ హరిత న్యాయస్థానం వరకు ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో నెలకొన్న తాజా వాతావరణం భవిష్యత్ పరిణామాలకు సంకేతమా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 ‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ'ఎక్కడ?

‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ'ఎక్కడ?

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏయేటికాయేడు వాహనాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం నగరంలో అన్ని రకాల వాహనాలు కలిపి 50 లక్షల వరకు ఉంటాయని అంచనా. ఇందులో సుమారు 15 లక్షల వరకు కాలం చెల్లిన వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న పొగలో ప్రమాదకర వాయువులు ఎక్కువగా ఉంటున్నాయి. అటు పరిశ్రమలు కూడా పరిమితికి మించి కాలుష్యం వెదజల్లుతున్నాయి. దీనివల్ల నగరంలో ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా తదితర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జపాన్‌ రాజధాని టోక్యోలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ'ని ఏర్పాటు చేశారు. దాని కఠిన నిబంధనలు, మార్గదర్శకాల వల్ల ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న టోక్యో నగరంలో కాలుష్యం స్థాయిలు నియంత్రణలో ఉండడం గమనార్హం. ఆ తరహాలోనే గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ ‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ'ఏర్పాటుచేసి, విస్తృత అధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టోక్యోలో అథారిటీ విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, రవాణా, పరిశ్రమలు, జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాల అధికారుల బృందం ఆ నగరంలో పర్యటించి వచ్చి ఆరునెలలైనా.. ఇక్కడ కనీస కార్యాచరణ కూడా ప్రారంభించకపోవడం గమనార్హం.

 మరో వారం భాగ్యనగరిలో ఇదే దుస్థితి

మరో వారం భాగ్యనగరిలో ఇదే దుస్థితి

విశ్వనగరంగా భాసిల్లుతున్న టోక్యోతో పాటు దాని సమీపంలోని 22 పట్టణాల్లో వాయు, జల, నేల కాలుష్యాన్ని జపాన్‌ ప్రభుత్వం గణనీయంగా కట్టడి చేసింది. రవాణా, స్థానిక సంస్థలు, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలిల భాగస్వామ్యంతో ‘క్లీన్‌ ఎయిర్‌ అథారిటీ'ని ఏర్పాటు చేసింది. ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్, ఈ - వేస్ట్, జీవ వ్యర్థాలను ఆధునిక సాంకేతిక విధానాల ద్వారా శుద్ధిచేసి పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకుంటోంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల డంపింగ్, తగలబెట్టడం వంటి చర్యలకు స్వస్తి పలికింది. ఉద్గారాలను అధిక మొత్తంలో వెదజల్లుతున్న పరిశ్రమలను కట్టడి చేసింది. కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియంత్రించింది. కాలుష్యానికి పాల్పడినవారికి జైలుశిక్ష, భారీగా జరిమానాలు విధిస్తోంది. హైదరాబాద్‌ నగరంలో వాతావరణ పరిస్థితులు, కాలుష్యం తీవ్రత మరో వారం పాటు ఇదే స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నట్లు పీసీబీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికి వెళ్లేవారు మాస్కులు ధరించడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు, హృద్రోగులు, వృద్ధులు, చిన్నారులు కాలుష్యం నుంచి, చలి తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Air pollution levels in Hyderabad city as now stages cautious level. At present there is no problem but this conditions continued as well as in future threat for Hyderabadis. Telangana Government and Telangana Pollution Control Board as to be act swiftly.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి