రేవంత్ ఆశలపై నీళ్లు- పొంగులేటి, జూపల్లి బిగ్ ట్విస్ట్- క్షమించండి అంటూ
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
అటు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది. ఈ క్రమంలో చేరికలకూ అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

ఇందులో భాగంగా- ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవడానికి అవసరమైన చర్యలన్నింటినీ పూర్తి చేసింది కాంగ్రెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు పొంగులేటి. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు గానీ అక్కడ ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారు.
జూపల్లి కృష్ణారావు పరిస్థితీ అంతే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ.. ఆ పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడిక మళ్లీ సొంతగూటికి చేరబోతోన్నారు జూపల్లి. పొంగులేటితో కలిసి కాంగ్రెస్ కండువాను కప్పుకోవడానికి సమాయాత్తమౌతోన్నారు. దీనికోసం వారిద్దరూ ఇవ్వాళ తమ అనుచరులతో సమావేశం అయ్యారు.
ఈ భేటీ తరువాత కాంగ్రెస్‌లో చేరబోతోన్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని భావించినప్పటికీ.. అలా జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వలేమని పొంగులేటి- జూపల్లి జాయింట్‌గా తేల్చి చెప్పారు. వారిద్దరూ సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో చేరికపై చాలావరకు నిర్ణయం తీసుకున్నామని చెబుతూనే కాకపోతే.. అనే ట్విస్ట్ ఇచ్చారు పొంగులేటి.
తామిద్దరం తమ తమ అనుచరులతో మరో దఫా సమావేశం కావాల్సి ఉందని, ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉందని పొంగులేటి స్పష్టం చేశారు. పార్టీ వివరాలు, చేరిక, తేదీ, సమయం తరువాత ప్రకటిస్తామని అన్నారు. తమ నిర్ణయం కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తోన్న తెలంగాణ బిడ్డలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తోన్నామని వివరించారు.
తాము ఏ నిర్ణయం తీసుకుంటామనే విషయంపై ఇన్ని రోజులు ఎదురు చూశారని, ఇంకొద్దిరోజులు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. మూడు లేదా నాలుగు రోజుల్లోనే తేల్చేస్తామనీ పొంగులేటి స్పష్టం చేశారు. ఈ విషయంలో జాప్యం జరుగుతున్నందుకు క్షమించమని యావత్ తెలంగాణ బిడ్డలను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నానని అన్నారు. చివరి నిమిషంలో పొంగులేటి-జూపల్లి ఈ ట్విస్ట్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications