ఖమ్మంలో కాక పుట్టిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్
ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, సీఎం కేసీఆర్ కు చేసిన సవాల్ ప్రస్తుతం ఖమ్మం రాజకీయాలలో కాక పుట్టిస్తుంది.
గత ఎన్నికలలో ఖమ్మం జిల్లా నుంచి కేవలం ఒక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని పేర్కొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆ ఒక్క స్థానాన్ని కూడా గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు. 2023లో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఖమ్మం జిల్లాలో రాకుండా చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.
తాను పార్టీ సభ్యుడిని కానప్పుడు తనను సస్పెండ్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ ఇప్పుడు తనని సస్పెండ్ చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తను జనవరి నుంచే విమర్శిస్తున్నానని, కానీ ఇప్పుడు సస్పెండ్ చేశారన్నారు. తను వైసీపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని తనపై ఎంతో ఒత్తిడి చేశారని, కేటీఆర్ తనతో ఎన్నోసార్లు మాట్లాడి కెసిఆర్ వద్దకు తీసుకువెళ్లారని అన్నారు.

తనకు సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ చెప్పారని, ఆయన మాటలు విని మోసపోయాను అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో చేరే సమయంలోనే చాలామంది టిఆర్ఎస్ పార్టీ నేతలు తమకు పట్టిన గతే మీకు పడుతుందని చెప్పారన్నారు. ఆరు నెలలు అంతా బాగానే ఉంటుందని, ఆ తర్వాత మా సార్ కేసీఆర్ అసలు స్వరూపం తెలుస్తుందని తన తోటి ఎంపీలు చెప్పారన్నారు. కానీ తనకు ఐదు నెలల్లోనే పరిస్థితి అర్థం అయిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా కేటీఆర్ కోసం పార్టీలో పని చేశానని చెప్పుకొచ్చారు.
ఇక బి ఆర్ ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా తాను ఖమ్మంలో రాజకీయాలు చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో మోసపోయిన నేతలందరిని ఒక తాటి పైకి తీసుకొస్తానన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ను ఓడించి తీరుతానని సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలతో జిల్లాలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది.












Click it and Unblock the Notifications