తెలంగాణ ఎన్నికల్లో కేఏ పాల్ పార్టీ అభ్యర్థులు వీరే: గజ్వేల్ సహా ఆ కీలక స్థానాలపై గురి
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

ఈ క్రమంలో విజయం సాధించడానికి అన్ని ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొంది ఇక్కడ. అధికార భారత్ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. అటు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన కూడా ఎన్నికల బరిలో నిలిచింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది.
ఈ పరిస్థితుల్లో ప్రజా శాంతి పార్టీ సైతం ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రముక క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్‌కు చెందిన పార్టీ ఇది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా నేరుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట గజ్వేల్ సహా కీలక నియోజకవర్గాల్లో దళిత ఓటుబ్యాంకుపై దృష్టి సారించింది ప్రజా శాంతి పార్టీ.
ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేఏ పాల్ విడుదల చేశారు. చెన్నూరు- మొయ్య రాంబాబు, జుక్కల్ (ఎస్సీ రిజర్వుడ్)- కర్రోళ్ల మోహన్, రామగుండం- బంగారు కనకరాజు, వేములవాడ- అజ్మీరా రమేష్ బాబు, నర్సాపూర్- సిరిపురం బాబు, జహీరాబాద్- బేగరి దశరథ్ పోటీ చేయనున్నారు.
ప్రతిష్టాత్మక గజ్వేల్ నియోజకవర్గం నుంచి పాండును అభ్యర్థిగా ప్రకటించారు కేఏ పాల్. ఉప్పల్- కందూరు అనిల్ కుమార్, యాకుత్‌పురా- సిల్లివేరు నరేష్, కల్వకుర్తి- కట్టా జంగయ్య, నకిరేకల్- కదీర కిరణ్ కుమార్, మధిర- కొప్పుల శ్రీనివాస రావు పేర్లను ప్రకటించారు. తమ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications