సీబీఐ డైరెక్టర్ ను కలిసిన కెఏ పాల్
సీబీఐ డైరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ ను మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రూ.9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని, దర్యాప్తు చేయాలంటూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

ప్రపంచంలోనే అరుదైన అవినీతి
ప్రపంచంలో ఈ తరహా అవినీతిని తాను ఎక్కడా చూడలేదని, రాష్ట్రంలోని ప్రజలు కూడా కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని, కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పాల్ కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కు రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని, ఇప్పుడు కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్లరూపాయల అప్పు చేసిందని విమర్శించారు. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవిత భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

యాదాద్రిలో రూ.వేల కోట్ల దోపిడీ
కేసీఆర్ కుటుంబం తెలంగాణ తో పాటు సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్ల రూపాయలు కాగా, కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించారు. మిగిలిన 75 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని, యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందని పాల్ తెలిపారు. రూ. 2 వేల కోట్ల అంచనా లో కేవలం రూ.200 కోట్లు ఖర్చు చేసి మిగిలినదంతా దోచుకున్నారని, కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని సీబీఐ డైరెక్టర్ ను కోరినట్లు పాల్ వివరించారు.

సీబీఐకి పూర్తి సహకారం అందిస్తా
నష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు న్యాయం చెయ్యాలని, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీల పై కూడా విచారణ జరిపితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు నాపై దాడులు చేస్తున్నారని, కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు సీబీఐకి పూర్తి సహకారం అందిస్తానని చెప్పానన్నారు. సిబిఐ తో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలా కు ఫిర్యాదు కాపీలను పంపించినట్లు కేఏ పాల్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications