''కట్టల కట్టలతో'' కేసీఆర్‌ను కలిసిన ప్రశాంత్ కిషోర్?
కట్టల కట్టల నివేదికలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రగతి భవన్‌లో కలిశారు. ప్రస్తుతం బీహార్ రాజకీయాలకే పరిమితమైన పీకే ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి కోసమే వ్యక్తిగతంగా పనిచేస్తున్నారు. ఏపీలో జగన్‌కు ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ పనిచేస్తున్నారు. తెలంగాణలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, ఎవరిపై ఎక్కువ వ్యతిరేకత, ఎవరిపై అనుకూలత, పార్టీ బలాలు, బలహీనతలు, ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు తదితర అంశాలపై ఐప్యాక్ టీం సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికతో పీకే కేసీఆర్‌ను కలిశారు. దాదాపుగా 40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉంటుందని, కొత్తవారికి అవకాశం ఇవ్వడంద్వారా విజయావకాశాలు మెరుగుపడతాయని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం.
ఈసారి ఎన్నికలకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టికెట్లు ఇచ్చేది ప్రశాంత్ కిషోర్ అని మంత్రి కేటీఆర్ ప్రకటించిన ఒక్క రోజు తేడాతోనే పీకే కేసీఆర్‌ను కలవడం విశేషం. మారుతున్న రాజకీయ పరిస్థితిని పార్టీకి అనుకూలంగా మార్చుకోవడంతోపాటు జాతీయ రాజకీయాల విషయంలోను కేసీఆర్‌కు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్రసమితిగా మార్చడం వెనక పీకే వ్యూహం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువంటి వ్యూహం అవలంబిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ పీకే నుంచి కోరారు. ప్రస్తుతం అధికార పక్షం బలంగా ఉండటం, ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. మమతాబెనర్జీ లేఖ రాయడం, కేసీఆర్‌ను ఆహ్వానించడం తదితర విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. దీనిపై పీకే సలహా ఎలా ఉంటుందనేదానిపై పార్టీవర్గాల్లో కొంత ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications