హరీష్ కాల్ డేటా తీయండి, తలసానీ తగ్గు: టీడీపీ, భువనేశ్వరి సీఎం కావొచ్చేమో: టీఆర్ఎస్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేశారు. ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావును విమర్శించే హరీష్ రావు, తెరాస నేతలు పాలమూరు వద్ద ప్రాజెక్టు వద్దని చెప్పిన వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పైన ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
టీడీపీ నేతలు వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు మాట్లాడారు. ఏడాదిలో కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ తప్ప మరేం చేయలేదని ఎద్దేవా చేశారు. హరీష్ రావు కాల్ డేటా తీస్తే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేసే మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డిలు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. వారు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.

ఏడాదిలో దళితులకు ఏం చేశారో కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెరాస వైఫల్య పాలన పైన నియోజకవర్గాల వారీగా ఉద్యమం చేస్తామని చెప్పారు. తెరాస ఇచ్చిన ఎన్నికల హామీలను నిలదీస్తామని చెప్పారు.
బీజేపీ మద్దతివ్వడం లేదేం: టీఆర్ఎస్
ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ తప్పు చేయలేదని భావిస్తే ఆ పార్టీ మిత్రపక్షం బీజేపీ ఎందుకు స్పందించడం లేదని, చంద్రబాబుకు ఎందుకు మద్దతివ్వడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, రాములు నాయక్ ప్రశ్నించారు.
చంద్రబాబుకు దారులన్నీ మూసుకుపోయాయని చెప్పారు. ఆయన జైలుకు వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో అల్లర్లు సృష్టించాలని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో అడ్డంగా దొరికిపోయాడన్నారు. ఆయనకు దారులు మూసుకుపోయాయని చెప్పారు. జైలుకు వెళ్లడం ఒక్కటే మిగిలి ఉందన్నారు.
చంద్రబాబు రాజీనామా చేస్తారని, కొత్త ముఖ్యమంత్రి కోసం టీడీపీలో చర్చలు జరుగుతున్నాయని, ఆయన భార్య భువనేశ్వరి ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలున్నట్లు టీడీపీలో చర్చ జరుగుతోందని ఎద్దేవా చేశారు. గవర్నర్‌ను కించపరిచే విధంగా మాట్లాడుతున్న మంత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ అనుమతి ఉంటేనే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications