Telangana: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా, గాడిద గుడ్డు.. ఒత్తిడిలో బీజేపీ ఎంపీలు..!
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరగడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ బీజేపీపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఢిల్లీకి వెళ్లి మూడుసార్లు ప్రధాని మోదీని కలిసినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు 18 సార్లు కేంద్ర మంత్రులను కలిసినా ఇలా చేయడం దారుణమన్నారు.
పెద్దన్న పాత్ర పోషించాలని మోడీని పదే పదే కోరినట్లు రేవంత్ గుర్తు చేశారు. సీఎం స్వయంగా ఎన్నో సార్లు కేంద్ర మంత్రులను కలిసినా తెలంగాణకు అన్యాయం జరగడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా సమఖ్య స్ఫూర్తి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సార్లు కేంద్ర మంత్రులను కలిసినా రాష్ట్రానికి అన్యాయం చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.48.21లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకే పెద్దపీట వేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. బడ్జెట్ లో తెలంగాణ పదం కూడా ఉచ్చరించలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తాజాగా తెలంగాణ కు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా.. తెలంగాణ గెట్స్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్ అంటూ సిద్దిపేట ఫ్లెక్సీ లు వెలిశాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటీ కేటాయింపులు లేకపోవడంతో ఈ ఫ్లెక్సీ లు పెడుతున్నారు.
తెలంగాణకు అన్యాయం జరగడంపై కూడా సోషల్ మీడియాలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. తొలిసారిగా తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా తెలంగాణకు అన్యాయం చేయడంపై చాలా మంది బీజేపీని నిలదీస్తున్నారు. దీంతో బీజేపీ ఎంపీలు ఒత్తిడిలో పడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణకు కేటాయింపులు జరిగాయని చెప్పినప్పటికీ బీజేపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications