మళ్లీ ప్రైవేటు కాలేజీల సమ్మె బాట - డెడ్ లైన్..!!
తెలంగాణలో మరోసారి ప్రయివేటు కాలేజీలు బంద్ జరగనుంది. ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల మళ్లీ సమ్మె బాట పట్టనున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా బకాయిలు చెల్లించటం లేదని కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 12లోపు బకాయిలు చెల్లించకుంటే 13 నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి సీఎంవో కార్యాలయంతో తప్ప మరెవరితో చర్చించమని, అవసరం అయితే విద్యార్థులతో కలిసి ఛలో హైదరాబాద్ చేపడతామని సంఘ నేతలు హెచ్చరించారు.
తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల నిర్వహణ సంఘం కీలక ప్రకటన చేసింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేకుంటే అక్టోబర్ 13 నుంచి ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు మూసివేస్తామని హెచ్చరించింది. గత నెల 21, 22 తేదీల్లో రూ.600 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చినా బకాయిలు చెల్లించలేదని, రూ.200 కోట్లు నిధులు మాత్రమే విడుదల చేశారని సంఘం నేతలు తెలిపారు. దీపావళి పండగలోపు రూ.1,200 కోట్లు ఇస్తామన్నారని, ఎలా ఇస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 12లోపు బకాయిలు చెల్లించకుంటే 13 నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.

అదే సమయంలో తాము ముఖ్యమంత్రి కార్యాలయంతో మినహా మరెవరితోనూ చర్చలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. గత నెలలో రూ.900 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ అక్టోబర్ 1 వరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. దసరాకు ముందు మరో రూ.600 కోట్లు, దీపావళికి ముందు అదనంగా రూ.600 కోట్లు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకు పెండింగ్ బకాయిలు చెల్లించలేదని చెప్పుకొచ్చారు. కాగా ప్రైవేట్ కాలేజీలు ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై సమ్మె చేస్తామనే హెచ్చరికల వేళ నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. అయితే, రెండు రోజుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కళాశాల యాజమాన్యాలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ చర్చల ద్వారా కాలేజీల సమ్మె అంశం కొలిక్కి రానుంది.












Click it and Unblock the Notifications