ఉద్యోగార్ధుల వయో పరిమితి సడలింపుపై కేసీఆర్ వద్దకు ప్రతిపాదనలు; నిరీక్షిస్తున్న నిరుద్యోగులు
ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు భారీగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో 81,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సిద్ధమవుతోంది. దశలవారీగా వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉద్యోగార్ధులకు తగిన సమయం ఇస్తూ పరీక్షలను నిర్వహించనుంది. దీంతో రాష్ట్రంలో 81 వేల ఉద్యోగాల భర్తీ జరగనుంది. దీనిపై సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ వేదికగా మెగా జాబ్స్ నోటిఫికేషన్స్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

వయో పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్న తెలంగాణా సర్కార్
ఇక ఇదే సమయంలో ఇంతకాలం నిరీక్షించి వయోపరిమితి నేపథ్యంలో తమకు ఉద్యోగం వస్తుందా లేదా అని ఆవేదన లో ఉన్న నిరుద్యోగులకు సైతం గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహాయించి ఇతర ప్రత్యక్ష నియామకాల గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన సమయంలో సీఎం కేసీఆర్ వయోపరిమితి పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఏజ్ లిమిట్ పెంచుతున్నట్లుగా కెసిఆర్ వెల్లడించారు.

వయోపరిమితి సవరణల ప్రతిపాదనలు కేసీఆర్ వద్దకు
ఇక ఈ మేరకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో ప్రభుత్వం ఉంది. ఏ క్షణంలోనైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేకపోలేదు. ఇక ఈ వయోపరిమితి సడలింపుపై ఇప్పటివరకు పూర్తిస్థాయి క్లారిటీ రాలేదు. అయితే మరి కొద్ది రోజుల్లో నిరుద్యోగులకు వయోపరిమితి పై గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే వయోపరిమితి విషయంలో సవరణలు చేసి ప్రతిపాదనను సిద్ధం చేసి ఆమోదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించినట్లు సమాచారం.

కేసీఆర్ ఆమోదం తర్వాత రానున్న ఫుల్ క్లారిటీ... నిరుద్యోగుల నిరీక్షణ
కెసిఆర్ ఆమోదంతో వయోపరిమితి పై పూర్తి క్లారిటీ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఓబీసీలకు 34 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 39 సంవత్సరాలు, దివ్యాంగులకు 44 సంవత్సరాలు వయో పరిమితి గా ఉంది. గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచాలని భావిస్తున్నట్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒకవేళ అదే కనుక జరిగితే ఓబీసీలకు 44 ఏళ్లకు ఎస్టీ బీసీలకు 49 ఏళ్లకు దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో దాదాపు లక్ష మందికి అదనంగా లాభం జరుగుతుందని భావిస్తున్నారు. మరి వయోపరిమితిపై సీఎం కేసీఆర్ ఏం ఫైనల్ చేస్తారన్నది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం.












Click it and Unblock the Notifications