దమ్ముంటే అరెస్ట్ చేయండి, మహా సంగ్రామమే!: ఢిల్లీలో కేసీఆర్ ఆవేశపూరిత ప్రసంగం, కేంద్రానికి డెడ్‌లైన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కేంద్రం, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వరి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు కేంద్రం వెంటపడతామన్నారు.

మహా సంగ్రామమే అంటూ కేంద్రానికి కేసీఆర్ హెచ్చరిక
ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం కొనాలని ఢిల్లీలో దీక్ష చేస్తున్నామన్నారు. కేసీఆర్‌దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన టికాయత్‌కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ దూరం వచ్చి దీక్ష చేస్తున్నామన్నారు. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? నిలదీశారు కేసీఆర్.
ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో పడవద్దని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయకపోతే మహా సంగ్రామమే జరుగుతుందని హెచ్చరించారు. ఒక దేశంలో ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలన్నారు.

గోల్‌మాల్ మంత్రి అంటూ పీయూష్ గోయల్‌పై కేసీఆర్ విసుర్లు
కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవని కేసీఆర్ అన్నారు. పీయూష్ గోయల్ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారు. మేము పీయూష్ గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా?. పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్‌మాల్ అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. మోటార్, విద్యుత్ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. అలుపెరుగని పోరాటంతో స్వరాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం తమ ప్రభుత్వం నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు.
సిగ్గులేని రాజకీయాలంటూ కేంద్రం, బీజేపీపై కేసీఆర్ ఫైర్
6 దశాబ్దాలపాటు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడామని తెలిపారు కేసీఆర్. రాష్ట్ర సాధనలో వందలాది మంది యువత బలిదానాలు చేసిందన్నారు. ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చింది. రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లో విద్యుత్ కోసం రైతుల ఆందోళనలు చేస్తున్నారు. పీయూష్ గోయల్ మీరు ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారు అంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. కేంద్రం, బీజేపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్: అరెస్ట్ చేయాలంటూ కేసీఆర్ సవాల్
తనపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు.. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. రైతుల కోసం రాకేష్ టికాయత్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసిస్తున్నారు. రైతుల కోసం పోరాడుతున్న టికాయట్‌ను కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉగ్రవాది, తీవ్రవాది అంటూ విమర్శలు చేశారని అన్నారు.
ఏడాదికిపైగా పోరాడితే కేంద్రం దిగివచ్చి కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని, అంతేగాక, ప్రధాని మోడీ కూడా రైతులకు క్షమాపణలు చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసే వరకూ తాము కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఆ తర్వాత ఏం చేయాలో కూడా తమకు తెలుసని అన్నారు.
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు కూడా ఉన్నాయంటూ కేంద్రానికి గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయండి అని కేసీఆర్ కోరారు. 24 గంటల్లోగా వరి ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం చెప్పాలి.. లేదంటే కేంద్రం, బీజేపీ వెంటపడతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications