పబ్జీ ఆడుతూ మెడనరాలు పట్టేసి ... జగిత్యాల యువకుడు బలి
ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే లోపు రోజూ ఏ వార్త చూసినా చూడకున్నా పబ్జీ గురించి మాత్రం తప్పక చూడాల్సి వస్తుంది. పబ్జీ ప్రాణాంతకంగా మారుతుంది. యువత భవిత నాశనం చెయ్యటమే కాకుండా ప్రాణాలను సైతం హరిస్తుంది . ప్రతినిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట పబ్జీ వల్ల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. చాలా పాపులర్ అయిన ఆన్‌లైన్ గేమ్ పబ్జీ గేమ్ కు సంబంధించి రోజుకో ఘటన ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది.
పబ్జీ ఆడుతూ అదృశ్యమైన బాలుడు ..పబ్జీ ఎఫెక్ట్ అంటున్న తల్లిదండ్రులు

ఆట ఆడుతూ టెన్షన్ లో మెడ నరాలు పట్టుకున్న యువకుడు
మొన్నటికి మొన్న సిద్దిపేటలో ఒక యువకుడు పబ్జీ ఆడొద్దు అని ఇంట్లో వాళ్ళు మందలించారని ఆత్మహత్యకు పాల్పడితే, నేడు పబ్జీ ఆడుతూ , అందులో ఉన్న యుద్ధ వాతావరణానికి టెన్షన్ ఫీల్ అయిన యువకుడు మెడనరాలు పట్టెయ్యటంతో ప్రాణాలు కోల్పోయాడు . పబ్జీ గేమ్ కి బానిసగా మారిన ఓ యువకుడు 45 రోజులుగా అదే పనిగా పబ్జీ ఆడుతున్నాడు .ఆట టెన్షన్ లో ఆ గేమ్ కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.

పబ్జీ వల్ల మెడనరాలు పట్టేసి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
అసలు ఏం జరిగిందంటే జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్ అనే 20 ఏళ్ల యువకుడు పబ్జీ గేమ్ కి బానిసగా మారాడు. గత 45 రోజులుగా పదే పదే ఈ గేమ్ ఆడుతూ ఉన్నాడు. కంటిన్యూస్ గా ఆడటంతో అతని మెడ నరాలు పట్టేశాయి. దీంతో అతని పరిస్థితి విషమించడంతో.. అతనిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. గత 5 రోజులుగా వైద్యులు సాగర్‌కు చికిత్స అందించగా.. నరాలు పూర్తిగా దెబ్బతినడంతో తుదిశ్వాస విడిచాడు.

స్నేహితుల అవేర్నెస్ వీడియో... పబ్జీ ఆడొద్దు అంటూ పిలుపు
ఇక పబ్జీ గేమ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాగర్‌ను చూపిస్తూ.. అతని స్నేహితులు ఓ అవేర్‌నెస్ వీడియోను కూడా రూపొందించారు. పబ్‌జీ గేమ్ ఆడటం ఎంత ప్రమాదకరమో సాగర్ పరిస్థితి చూసి తెలుసుకోండని ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

తల్లిదండ్రులు జర భద్రం .. ముందే కట్టడి చెయ్యండి
ఇక మానసిక నిపుణులు సైతం ఈ ఆన్ లైన్ గేమింగ్ పబ్జీ ఆట ఓ వ్యసనంగా మారుతోందని చెప్తున్నారు.
పబ్జీ ఆటపిల్లలకు వ్యసనంగా మారిన తర్వాత కాకుండా ఆదిలోనే పిల్లలు ఈ గేమ్ కు అలవాటు పడకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ లు కొనిచ్చి పబ్జీ ఆడుకోనిచ్చి పిల్లల భవిష్యత్ ప్రశ్నార్ధకం చెయ్యకుండా వాళ్ళు ఆ ఆటకు బానిసలు కాక ముందే మేల్కొంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయి.