మన్మోహన్ సింగ్‌ను రాజకీయాల్లోకి తెచ్చింది మన పీవీనే
దేశంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంతోపాటు రాజకీయాల్లో తనదైన విశిష్ట ముద్ర వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మన తెలుగువాడే కావడం విశేషం. ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్ సింగ్‌కు రాజకీయాలు పరిచయం చేసింది మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కావడం గమనార్హం.
1991లో ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి మన్మోహన్ సింగ్‌ను రాజ్యసభకు పంపించి ఆర్థిక మంత్రిని చేశారు పీవీ నరసింహారావు. లిబరలైజేషన్, ప్రవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు ఈ ఇద్దరు దిగ్గజాలు.
ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా చేసిన నాటి సంస్కరణలు దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంలో ఎంత కీలకంగా మారాయో తెలిసిన విషయమే. వాటి ఫలాలు ఇప్పటికీ అందుతున్నాయి. ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలను ఇటీవల ప్రశంసించడం గమనార్హం.

కాగా, మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు, వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎయిమ్స్‌కు వెళ్లారు. బెల్గావిలో సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి ఢిల్లీకి హుటాహుటిన బయల్దేరారు. శుక్రవారం నాటి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్‌కు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారు. ఆస్పత్రి వద్ద పెద్ద మొత్తంలో బలగాలు మోహరించాయి. తొలుత భారత ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్.. ఆ తర్వాత పదేళ్లపాటు ప్రధానిగా సేలందించారు.
1932, సెప్టెంబర్ 26, మన్మోహన్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని గాహ్‌లో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు. ప్లానింగ్ కమిషన్ చీఫ్‌గా, ఎకనామిక్ అడ్వైజర్‌గా భారత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేశారు. 1991లో తొలిసారి మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
1991-96 వరకు అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. తొలి సిక్కు ఆర్థికమంత్రిగా ఆయన రికార్డుల్లోకెక్కారు. భారత ఆర్థిక ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఘనత వహించారు. ఇక, 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో భారత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చాయి. 2024లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేశారు. దేశంలో సుదీర్ఘ కాలం పనిచేసిన ప్రధానమంత్రుల్లో ఒకరిగా మన్మోహన్ సింగ్ నిలిచారు.












Click it and Unblock the Notifications