Chillies: రికార్డు ధర పలికిన ఎర్ర బంగారం.. క్వింటాకు రూ. 80,100
ఈ ఏడాది మిర్చికి రికార్డు స్థాయిలో ధర వస్తుంది. తాజాగా తాజాగా వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో దేశీ మిర్చికి రూ. 80,100 పలికింది. ఈ ధర ఏనుమాముల మార్కెట్ చరిత్రలోనే దేశీ కొత్త మిర్చికి రికార్డ్ ధర పలికిందని వ్యాపారులు వివరిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుండి ఓ రైతు నాలుగు బస్తాల మిర్చిని ఎనుమాముల మార్కెట్ యార్డుకు తరలించారు. ఈ మిర్చిని కొనుగోలు చేసేందుకు పోటీలు పడ్డారు. చివరికి రూ. 80, 100లకు వ్యాపారులు ఈ మిర్చిని కొనుగోలు చేశారు. గతంలో ఇదే మిర్చి రూ. 20 వేలకు పైగా ధర పలికింది.

ఒకటి రెండు బస్తాలు
కాగా ఈ ఏడాది మిర్చికి డిమాండ్ భారీగా పెరగడంతో పాటు దిగుబడి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. గతంలో దేశవాళీ మిర్చి బస్తాలు ప్రతి రోజూ వెయ్యి నుండి రెండువేల బస్తాలు వచ్చేవి. కానీ దిగుబడి తగ్గిపోవడంతో దేశవాళీ మిర్చి కేవలం ఒకటి రెండు బస్తాలు మాత్రమే వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. దేశవాళీ మిర్చితో పాటు ఇతర రకాల మిర్చి కి కూడా భారీగా డిమాండ్ నెలకొంది.

3వేల బస్తాలు
ఏనుమాముల మార్కెట్ లో గంటన్నరలోనే 3వేల బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి కొనుగోళ్లకు గుంటూరు, ఏనుమాముల మార్కెట్లు ప్రసిద్ధి చెందాయి. ఈ సంవత్సరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో మిర్చి సాగు చేశారు.

తెగుళ్లు, వర్షాలు
పాలకుర్తి మండలంలో 16 గ్రామపంచాయతీల పరిధిలో 304 మంది రైతులు 395 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇక్కడ 10 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొడకండ్లలో 10 గ్రామపంచాయతీల పరిధిలో 205 మంది రైతులు 255 ఎకరాల్లో సాగు చేయగా 5 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. దేవరుప్పుల మండలంలో 9 గ్రామపంచాయతీల పరిధిలో 90 మంది రైతులు మిర్చి సాగు చేయగా 2500 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. అయితే తెగుళ్లు, వర్షాల కారణంగా పంట దెబ్బతిని దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications