కేటీఆర్ రాజకీయాలు మానేసి..: రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగోలేవని.. ఒకానొక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. నవంబర్ 1న సంగారెడ్డిలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందని కేటీఆర్ అన్నారు.. మరీ ఆయన రాజకీయాలు మానేస్తానంటే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు.
రాజకీయాలు బంద్ చేసి.. అమెరికా వెళ్లి బాత్రూంలు కడుక్కో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించారు. అధికారంలో ఉన్న పదేళ్లు ప్రజలను కలిసే సమయం దొరకలేదు కానీ, అధికారం పోగానే పాదయాత్ర చేస్తానంటున్నాడని కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

కేటీఆర్ పాదయాత్ర ప్రజల కోసం కాదని.. డబ్బు అధికారం, ఫాంహౌస్ కోసమేనని రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనతో మీకు పది నెలల్లోనే విసుగొస్తే.. అదే పాలన చేసిన మిమ్మల్ని పదేళ్లు ప్రజలు ఎలా భరించారని నిలదీశారు. మీ నాన్న కేసీఆర్ పది నెలలు ఫాంహౌస్ లో ఉన్నారని.. తెలంగాణ ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
కేటీఆర్ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరనని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు తన తండ్రి, చెల్లె, బావతోపాటు ఎవరిపైనా నమ్మకం లేదన్నారు. కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్ కేసులో పాలేవో.. నీళ్లేవో తేలాలంటే సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అంటున్నారని.. రాష్ట్రంలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా? అని ప్రశ్నించారు. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన కుక్క తోక పటాకులు కూడా పేలలేదని మంత్రి వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. దీపావళికి ముందే రాజకీయా బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలోని పెద్దల అరెస్టులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అలాంటిదేం జరగలేదు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు ఈ మేరకు స్పందించారు.












Click it and Unblock the Notifications