తెలంగాణాలో కొత్తగా ఆరు రైల్వే లైన్లు ఈ మార్గాల్లోనే: కేంద్రమంత్రి శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయడానికి రైల్వే ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో కీలక ప్రకటన చేసి తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించి అనేక వివరాలను వెల్లడించారు.
కొత్త రైల్వే డిపిఆర్ సర్వేలకు అనుమతి: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
రాష్ట్రంలో ఆరు కొత్త రైల్వే డిపిఆర్ సర్వేలకు అనుమతి ఇచ్చినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణానికి ప్రతిపాదించిన ఈ ఆరు లైన్లలో 250 కిలోమీటర్ల కాచిగూడ జగ్గయ్యపేట, 320 కిలోమీటర్ల పటాన్ చెరువు - ఆదిలాబాద్, 122 కిలోమీటర్ల వికారాబాద్- కృష్ణ, 316 కిలోమీటర్ల గద్వాల- డోర్నకల్ వయా కల్వకుర్తి, 128 కిలోమీటర్ల బోధన్- లాతూర్ రోడ్, 128 కిలోమీటర్ల అక్కన్నపేట బైపాస్ ఉన్నాయి.

కొత్త ఆరు రైల్వే లైన్లను నిర్మించడానికి ముందుకు వచ్చిన రైల్వే
డి పి ఆర్ పూర్తయిన తర్వాత ప్రాజెక్టు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య పక్షాలతో రైల్వే శాఖ సంప్రదింపులు జరుపుతుందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత నీతి ఆయోగ్, ఆర్థిక శాఖలో అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియకు ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్న మంత్రి, ఏది ఏమైనా త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆరు రైల్వే లైన్లను నిర్మించడానికి రైల్వే ముందుకు వచ్చిందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో 18 కొత్త లైన్లు, 39 డబ్లింగ్ మార్గాలు
2022- 2023 నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 18 కొత్త లైన్లు, 39 డబ్లింగ్ మార్గాలు కలిపి మొత్తం 57 లైన్ల సర్వేలకు అనుమతి లభించగా, ఈ లెక్క ప్రకారం 565 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్లు రాష్ట్రంలో ఇప్పటివరకు పూర్తిగాను, పాక్షికంగాను విస్తరించి ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రధాన ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను జాప్యం చేయడం వల్ల ఆలస్యం అవుతున్నాయి.
కొత్త లైన్ పనులకు జరుగుతున్న భూసేకరణ
ముద్ఖేడ్- మహబూబ్నగర్- డోన్ డబ్లింగ్ పనులు, కాజీపేట- విజయవాడ 3వ లైన్ పనులు, గుంటూరు- బీబీనగర్ డబ్లింగ్ పనులు, మనోహరాబాద్- కొత్తపల్లి కొత్త లైన్ పనులు ఇలా ప్రాజెక్టుల వారీగా భూ సేకరణ కోసం పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు కొత్త ప్రాజెక్టులకు అవసరమైన మొత్తం 2343 హెక్టార్ల భూమిలో 1580 హెక్టార్లు మాత్రమే సేకరించింది.
తెలంగాణాలో రైల్వే విస్తరణకు కేంద్రం ఫోకస్
ఇంకా భూసేకరణ జరగాల్సి ఉండగా, భూసేకరణ పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగిస్తే తప్ప ఆ ప్రాజెక్టులు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో రైల్వే విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఫోకస్ చేస్తుందని, తాజాగా కొత్త ఆరు రైల్వే లైన్ల విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనతో స్పష్టమైంది.












Click it and Unblock the Notifications